అమితాబ్‌కు సజ్జనార్ స్వీట్ వార్నింగ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-31 13:44:13.0  )
అమితాబ్‌కు సజ్జనార్ స్వీట్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలతో పాటు యాడ్స్‌ కూడా తీస్తుంటారు. అయితే వాటిలో కొన్ని కంపెనీలు జనాలను మోసం చేస్తున్నాయని, అలాంటి వాటికి ప్రచారం చేయోద్దని అమితాబ్‌ బచ్చన్‌కు ట్విట్టర్ వేదికగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. ‘అమితాబ్‌తో పాటు మిగిలిన స్టార్‌ హీరోలందరికి నాదొక విజ్ఞప్తి. మోసం చేసే కంపెనీలకు ప్రచారం చేయకండి. మీ స్టార్ డమ్‌ను మంచి కోసం వాడండి. మీ పేరు, ప్రతిష్టలను సమాజానికి చెడు చేసే కంపెనీలపై వెచ్చించొద్దు. ఆమ్వే లాంటి కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి.

ఇలాంటి కంపెనీలకు ప్రచారం చేయడం వల్ల ప్రజలు, వ్యవస్థ మరింత నష్టపోయే ప్రమాదం ఉంది’ అని సజ్జనార్‌ ట్వీట్‌ చేశాడు. కాగా, అమితాబ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్వేపై 2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. గొలుసు క‌ట్టు వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన ఈడీ.. ఆమ్వే ఆస్తులను జప్తు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఇక, గతంలో ఓ మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ సంస్థకు టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారం చేయడంపై ఆయన ట్విట్టర్‌లో స్పందించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story