- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రభుత్వ పేరు మార్పు.. రాష్ట్ర అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఫోకస్
దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో ఉనికిలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి గత ప్రభుత్వం ‘టీఎస్’ (తెలంగాణ స్టేట్) అని నామకరణం చేసింది. ఆ పేరుతోనే అధికారిక కార్యకలాపాలన్నీ పదేండ్ల పాటు కొనసాగాయి. ‘టీఎస్’ అనే పదాన్ని ఖరారు చేయడంపై అప్పట్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణ అనే పదానికి ‘టీజీ’ అనే అబ్రివేషన్‌ను పెట్టడమే సమంజసంగా ఉంటుందనే అభిప్రాయం వచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం లెక్క చేయకుండా ‘టీఎస్’ పదాన్నే ఫిక్స్ చేసింది. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఇకపైన టీజీ అని పిలవడమే సముచితంగా ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఆదివారం సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంలో పేరు మార్పుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నది.
ఉనికిలోకి టీజీ
ఇకపైన ‘టీఎస్’ అని పిలవడానికి బదులుగా ‘టీజీ’ అని పిలిచేలా విధానపరమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశమున్నది. కేబినెట్ సమావేశం కోసం రూపొందించిన ఎజెండాలో దీన్ని ప్రాధాన్యతా క్రమంలో తొలి వరుసలో పెట్టినట్లు తెలిసింది. ఇక నుంచి ‘టీజీ’ అనే పదం ఉనికిలోకి వచ్చే అవకాశమున్నది. ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టడంతో పార్టీ పేరుకు సారూప్యంగా ఉండేలా ‘టీఎస్’ అనే పదాన్ని ఫిక్స్ చేశారన్న వ్యాఖ్యలు అప్పట్లో బహిరంగంగానే వినిపించాయి.
మారనున్న సంస్థల పేర్లు
రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ‘టీజీ’ అనే పదాన్ని వాడేలా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని గెజిట్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తే వాహనాల నెంబర్లతో పాటు పలు ప్రభుత్వరంగ సంస్థల పేర్లు మారిపోతాయి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ అనేది వస్తుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇక నుంచి ‘టీజీపీఎస్సీ’గా మారుతుంది. తెలంగాణ స్టేట్ ఆర్టీసీ (టీఎస్ఆర్టీసీ) ఇక నుంచి ‘టీజీఆర్టీసీ’గా మారుతుంది. ఇలాంటి ప్రభుత్వరంగ సంస్థల పేర్లన్నీ టీజీతో మొదలవుతాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే చాలా మంది విద్యార్థులు, తెలంగాణవాదులు వారి బైక్‌లు, కార్ల నెంబర్ ప్లేట్లపై ‘టీజీ’ అని ఇంకుతో రాసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లయితే అఫీషియల్‌గానే నెంబర్ ప్లేట్లపై టీజీ దర్శనమిస్తుంది.
రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై చర్చ
రాష్ట్రంలో సచివాలయం మొదలు హెచ్ఓడీలు, జిల్లాల్లోని డిపార్టుమెంట్ల వరకు సుమారు 1,040 మంది రిటైర్డ్ ఉద్యోగులు రీ అపాయింట్‌మెంట్, ఎక్స్‌టెన్షన్, కాంట్రాక్టు బేసిస్, ఔట్‌సోర్సింగ్.. ఇలా వివిధ రూపాల్లో విధుల్లో ఉన్నారు. అన్ని శాఖలు, విభాగాల నుంచి ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవల వివరాలను తెప్పించిన తర్వాత 1,040 మంది ఉన్నట్లు తేలింది. విద్యుత్ శాఖలో, డిస్కంలలో, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో భారీ సంఖ్యలో ఇలాంటి ఉద్యోగులు ఉన్నారని వివరాలు అందాయి. రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగించడం ద్వారా కొత్త అపాయింట్‌మెంట్లకు ఆస్కారం లేకుండాపోయిందని, నిరుద్యోగుల ఆశలపై బీఆర్ఎస్ సర్కార్ నీళ్లు చల్లిందంటూ కాంగ్రెస్ గతంలో విమర్శలు చేసింది.
గ్రూప్-1పై దృష్టి
ఇప్పుడు అదే పొరపాటు జరగకుండా దిద్దుబాటు చర్యల్లో భాగంగా వీరిని తొలగించాలని, తద్వారా ఖాళీ అయ్యే పోస్టుల్లో కొత్తవారిని రిక్రూట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పుడు లెక్కలు తేలడంతో కేబినెట్ భేటీలో ఈ అంశాన్ని చర్చించి స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నది. దీనికి తోడు గ్రూపు-1 పరీక్షల నిర్వహణ, నోటిఫికేషన్ జారీ, గత నోటిఫికేషన్‌కు చేయాల్సిన సవరణలు, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ ఉపసంహరణ తదితరాలన్నింటిపైనా ఈ భేటీలో చర్చ జరగనున్నది. గవర్నర్ ప్రసంగం కూర్పు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ సుమారు పాతిక అంశాలతో ఎజెండా రూపొందినట్లు సచివాలయ వర్గాల సమాచారం.