చర్చ దానిపైనే.. ఫామ్ హౌజ్‌లో అత్యవసర భేటీ సీక్రెట్ ఇదేనా?

by Sathputhe Rajesh |
చర్చ దానిపైనే.. ఫామ్ హౌజ్‌లో అత్యవసర భేటీ సీక్రెట్ ఇదేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి అందుబాటులో ఉన్న మంత్రులతో శనివారం భేటీ కావడం అనేక చర్చలకు, ఊహాగానాలకు దారితీసింది. యాసంగి వడ్ల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేనున్నట్టు అధికారికంగా ప్రకటన చేసినా.. ముందస్తు ఎన్నికలు సహా అనేక అంశాలపై చర్చ జరిగినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈసారి ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్యూలు ప్రకారమే వచ్చే ఏడాది చివర్లో ఎలక్షన్స్ జరుగుతాయని స్వయంగా సీఎం నెల క్రితమే మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. కానీ పార్టీ వర్గాల్లో నిరంతరంగా చర్చ జరుగుతూనే ఉన్నది. ఇదే అంశంపై ఎర్రవల్లి ఫామ్ హౌజ్ మీటింగులో చర్చ జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది చివర్లో..?

ఈ ఏడాది చివర్లో గుజరాత్ రాష్ట్రంతో పాటే తెలంగాణకూ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు బలంగా అభిప్రాయపడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య ఇదే చర్చ జోరుగా సాగింది. గతంలో లాగానే ఈసారి కేంద్రం ముందస్తు ఎన్నికలకు సహకరించకపోవచ్చనే వాదనా తెరపైకి వచ్చింది. వడ్ల కొనుగోళ్ల అంశంపై ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ అయ్యే సందర్భంగా ముందస్తుకు ముందుగానే గ్రౌండ్ క్లియర్ చేసుకునే దానిపై చర్చించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టులోనే అసెంబ్లీ రద్దయ్యే చాన్స్ ఉందని, గుజరాత్‌కు నవంబరు లేదా డిసెంబరులో జరిగే ఎన్నికలతో పాటే తెలంగాణలోనూ జరగొచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరోవైపు ప్రధాన కార్యదర్శిని కూడా ఎర్రవల్లిలో మంత్రులతో జరిగిన సమావేశానికి ఆహ్వానించారు. ఖాళీ పోస్టుల భర్తీకి వీలైనంత తొందరగా నోటిఫికేషన్లను జారీ చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించినట్టు తెలిసింది. రెండు రోజుల క్రితమే ఐదు శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎస్ సమీక్ష నిర్వహించి ఆచరణాత్మక ఇబ్బందులపై చర్చించారు. ఆర్థిక శాఖ నుంచి తొందరగా ఆర్థికపరమైన అనుమతులు మంజూరుచేసే ఉత్తర్వులను జారీ చేయాలని ఆదేశించారు. నోటిఫికేషన్ల ఇవ్వడం ద్వారా యువతలో కాన్ఫిడెన్స్ నెలకొల్పవచ్చనే అభిప్రాయాన్ని గతంలోనే ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికల ప్లాన్ ఆచరణలోకి వస్తే ఆ సమయానికి జాబ్ నోటిఫికేషన్లకు అనుగుణంగా యువత పరీక్షలు రాయడం, ప్రిపేర్ కావడం తదితర కార్యకలాపాల్లో మునిగిపోతారనే చర్చ సైతం జరిగినట్టు తెలిసింది. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజులూ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజల మధ్యనే గడపాలని, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సీఎం ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. తాజాగా దళితబంధు విషయంలోనూ లబ్ధిదారుల ఎంపిక అంశంపై ఎమ్మెల్యేలకే బాధ్యతలు అప్పజెప్పారు. అన్ని జిల్లాల్లో టూర్‌లు చేయనున్నట్టు గతంలో సీఎం ప్రకటించినా అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగసభలకు మాత్రమే హాజరవుతానని, మిగిలిన పార్టీ కార్యకలాపాలను మంత్రులే చూసుకోవాల్సిందిగా తాజా సమావేశంలో క్లారిటీ ఇచ్చినట్టి తెలిసింది.

అసంతృప్తులు చేజారకుండా..

రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంపైనా జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఫోకస్ పెట్టాల్సిందిగా సూచించినట్టు సమాచారం. అసంతృప్తి, అసమ్మతితో ఉన్న నేతలను గుర్తించి పార్టీ నుంచి వారు చేజారకుండా చూసుకోవడంతో పాటు బీజేపీ వైపు వారు వెళ్లకుండా చూసుకోవాలని వివరించినట్టు తెలిసింది. కేటీఆర్‌కు సీఎం బాధ్యతలు అప్పజెప్పడంపై మంత్రులు గతంలో బహిరంగంగా వ్యాఖ్యలు చేసినా సీఎం కేసీఆర్ మాత్రం వాటిని తిప్పికొట్టారు. ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని, కేటీఆర్‌కు అప్పజెప్పబోనని, మరోసారి వ్యాఖ్యలు చేయవద్దని మంత్రులను వారించారు. ఇప్పుడు అనారోగ్యం దృష్ట్యా కేటీఆర్‌కు పాలనా పగ్గాలను అప్పజెప్పవచ్చనే చర్చలూ జరుగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా ప్రధాని మోడీపై విమర్శలు చేసిన సీఎం కేసీఆర్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత నేరుగా ఆరోపణలు చేయడం, ఆగ్రహం ప్రదర్శించడాన్ని నిలిపివేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగానూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడంతో వాటిని ప్రస్తావించి విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇప్పుడు వడ్ల కొనుగోలు అంశంలో మళ్లీ ప్రధానిని కలవడానికి సిద్ధపడుతున్నందున కేంద్ర బడ్జెట్ సందర్భంగా కేంద్రాన్ని, మోడీని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించడానికి మోడీతో భేటీ కావాలనుకుంటున్నారా? లేక రాజీ ప్రయత్నాలకా? అనే చర్చలు రాష్ట్రంలో మొదలయ్యాయి.

Advertisement

Next Story