కాంగ్రెస్ లీకులతో బీఆర్ఎస్‌లో డైలమా.. గులాబీ పార్టీని డిఫెన్స్‌‌లో పడేసిన అంశమిదే..!

by Rajesh |
కాంగ్రెస్ లీకులతో బీఆర్ఎస్‌లో డైలమా.. గులాబీ పార్టీని డిఫెన్స్‌‌లో పడేసిన అంశమిదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మీరు పార్టీ మారుతున్నారటగా..!’ అన్న డౌట్ క్లారిఫై చేసుకునే లోపే వికెట్లు టప టపా పడుతున్నాయి. పార్టీ మార్పుపై అడగాలా వద్దా అన్న సంకోచం.. ధైర్యం చేసి అడిగితే లేని ఆలోచన కల్పించినట్లు అవుతుందా అన్న అనుమానం.. సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితి.. వెరసి బీఆర్ఎస్ పార్టీని సంకట స్థితిలోకి నెట్టేశాయి. ఆ ఎమ్మెల్యే చేరుతున్నాడు.. ఈ ఎమ్మెల్సీ చేరాడు.. అన్న లీకులతో షాక్‌లు తప్పడంలేదు. ఎవరు చేరుతున్నారో... ఎవరు చేరడం లేదో... ఎవరు కలుస్తున్నారో తెలియక గులాబీ పార్టీ డిఫెన్స్‌లో పడిపోయింది. నేతలను నిర్ధారణ చేసుకోలేక సతమతమవుతోంది. పార్టీ మారకుండా ఎలా కాపాడుకోవాలో తెలియక అధిష్టానం ఆందోళన చెందుతోంది.

కాంగ్రెస్‌ను ఇరుకున పెడదాం... వైఫల్యాన్ని ఎత్తిచూపి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేద్దామని బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరం చేసి గులాబీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నది. ఇక బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయమని లీకులు ఇస్తుండటంతో ఎమ్మెల్యేలను కట్టడిచేయడంలోనే బీఆర్ఎస్ దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరు కాంగ్రెస్‌లో చేరతారో గెస్ చేయని విధంగా చేరికలు సాగుతున్నాయి. ఎవరు ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారు... ఎవరెవరు టచ్‌లోకి వెళ్లారనేది గులాబీ అధినేతకు తెలియకుండా మంతనాలు చేస్తున్నారు.

పార్టీ కండువా కప్పుకునేవరకు చేరుతారనే ఆలోచన రాకుండా ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిత్యం పార్టీ నేతలతో టచ్‌లో ఉండటంతో పాటు ఫాం హౌజ్‌కు వెళ్లి మరీ కలుస్తున్నారు. పార్టీలోనే ఉంటామని అధినేతకు వివరిస్తున్నారు. వీళ్లు పార్టీ మారరు అని అనుకున్న సమయంలోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్‌లో చేరి షాక్ ఇచ్చారు. ఇంకా కొంతమంది చేరుతారని కాంగ్రెస్ లీకులు ఇస్తుండటంతో ఎవరు చేరుతారనేది నిర్ధారణ చేసుకోలేక పార్టీ అధిష్టానం సతమతమవుతోంది.

పిలిచి అడిగితే ప్రయోజనం లేదనే అనుమానం

పార్టీ మారే ఎమ్మెల్యేలు చివరకు సస్పెన్స్ పెడుతున్నారు. సీఎంను, కాంగ్రెస్ నేతలను కలిస్తే చేరుతున్నారనే ప్రచారం జరిగితే వాటికి ఖండన సైతం ఇస్తున్నారు. కొందరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ పేర్కొంటున్నారు. తీరా చూస్తే కొంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకొని దర్శనమిస్తున్నారు. ఈ సమయంలో గులాబీ అధిష్టానం మాత్రం చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోతోంది. పార్టీ మారాలని డిసైడ్ అయిన వారిని పిలిచి అడిగినా ప్రయోజనం ఉండదనే అనుమానం వ్యక్తం చేస్తోంది. స్వయంగా పార్టీ అధినేతను కలిసి పార్టీలో ఉంటామని, పార్టీ గుర్తింపు ఇచ్చిందని, పార్టీ టికెట్‌పైనే గెలిచామంటూ పేర్కొంటున్నారు. అయినప్పటికీ పార్టీకి హ్యాండ్ ఇస్తుండటంతో ఎవరిని పిలిచి మాట్లాడితే ప్రయోజనం ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు అడిగితే పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నా తమపైనే అనుమానా? అంటూ నొచ్చుకునే పరిస్థితి లేకపోలేదు. దీంతో పార్టీ పరిస్థితి ముందు నుయ్యి... వెనుక గొయ్యిలా తయారైంది.

అడగకుంటే చేజారుతారనే ఆందోళన

ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కట్టడికోసమే ఫాం హౌజ్‌కు కేసీఆర్ పిలిచి మారీ మాట్లాడుతున్నారు. స్వయంగా ఫోన్లు సైతం చేస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా వారితో లంచ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ, కుటుంబ బాగోగులు తెలుసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కొంతమంది పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకోవడంతో వారిని సైతం పిలిచి మాట్లాడుతున్నారు. అయితే పార్టీ మార్పుపై మాత్రం అడిగేందుకు సంకోచిస్తున్నట్లు సమాచారం. అడిగితే ఎలా ఫీలవుతారు? అడగకుంటే పార్టీ మారతారనే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎమ్మెల్యేను పట్టుకొని పార్టీ మారుతున్నావా? అని అడిగే పరిస్థితి లేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఏం అడిగితే ఎలా రియాక్టు అవుతారో తెలియని పరిస్థితి నెలకొందని, మనస్సు నొచ్చుకుంటే పార్టీ మారే అవకాశం ఇంకా మెరుగ్గా ఉంటుందని, లేని అభిప్రాయాన్ని కల్పించినట్లు అవుతుందని పేర్కొంటున్నారు.

దిక్కోతోచని స్థితిలో బీఆర్ఎస్

శాసనసభలో, మండలిలో బీఆర్ఎస్ ఎల్పీలు విలీనం చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలని అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ అధినేత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని... బీఆర్ఎస్‌ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నేతలు సైతం ఇదే విషయాన్ని మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇప్పుడేమో ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మార్పుపై విస్తృత ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుండటం, ఎవరు పార్టీ మారుతారో తెలియక గులాబీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

Advertisement

Next Story

Most Viewed