భక్తులు భద్రత చర్యలు పాటించాలి! ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ

by Geesa Chandu |
భక్తులు భద్రత చర్యలు పాటించాలి! ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: గణేశ్ మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కకూడదని, సంస్థ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ పొందాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై శాఖ అధికారులతో సంస్థ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. శనివారం గణేశ్ ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 11 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. గణేశ్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోందని, విద్యుత్ సిబ్బంది, సెక్షన్ అధికారులు తమ పరిధిలో ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించి, విద్యుత్ పరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచనలు చేశారు. సామాన్య ప్రజలు, భక్తులు, నిర్వాహకులు మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని కోరారు. ఐఎస్ఐ మార్క్ కలిగిన ప్రామాణిక విద్యుత్ వైర్లను మాత్రమే వినియోగించాలని, ఎలాంటి జాయింట్ వైర్లు వాడకూడదన్నారు. తగినంత కెపాసిటీ కలిగిన ఎంసీబీ వాడాలని సూచించారు. ఇది విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుందన్నారు. మండపాల్లో విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. విద్యుత్ వైర్లు, స్తంభాలు, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలని స్పష్టంచేశారు. ఒకవేళ ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలితే వారికి వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాదం గురించి దగ్గరలోని విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలన్నారు. విద్యుత్ వైరింగ్ లో లీకేజ్ ఉంటే, వర్షాలు కురిసినప్పుడు తేమ వల్ల షాక్ కలిగే అవకాశముందని, అందుకే తప్పనిసరిగా వైరింగ్ ను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. విద్యుత్ లైన్స్ ఎక్కడైనా తెగిపడినా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే 1912 లేదా 100 లేదా సమీప ఫ్యూజ్ ఆఫ్ కాల్ కు ఫోన్ చేసి విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని చెప్పారు. ఈ సమీక్షలో డైరెక్టర్ ఆపరేషన్ నర్సింహులు, చీఫ్ ఇంజినీర్లు కే సాయిబాబా, శివాజీ, ఆనంద్, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed