Bhatti Vikramarka: రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

by Ramesh N |
Bhatti Vikramarka: రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంక్రాంతి గొప్ప పండుగలా చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన నాలుగు కొత్త సంక్షేమ పథకాల అమలు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఈ సంక్రాంతి నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి నాలుగు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తుందన్నారు. ఈ నాలుగు పథకాల అమలుకు సుమారు 40 నుంచి 45 వేల కోట్ల అధిక భారం పడుతుందన్నారు. ఎన్ని ఆర్టిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 22,500 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు 2000 కోట్లు, రైతు భరోసా కు 19 వేల కోట్లు చొప్పున ఖర్చు చేసుకుంటూ ముందుకు పోతామన్నారు. ఈ నాలుగు కొత్త పథకాల అమల్లో ఎక్కడ ఎవరికి సందేహాలు అవసరం లేదన్నారు. లబ్ధిదారుల ఎంపిక, అమలుకు విధి విధానాలు లోతుగా చర్చించిన తర్వాతే రాష్ట్ర క్యాబినెట్ ప్రకటన చేసిందన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటినీకి పరిమితి లేకుండా ఎకరాకు సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఆర్‌ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా, వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు తీసుకున్న కుటుంబం కనీసం 20 రోజులు పని చేసి ఉండి సెంటు భూమి కూడా లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందుతుందని తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సైతం పూర్తిగా అర్హులనే ఎంపిక చేస్తామని అన్నారు. ఈ నెల నుంచి అమలు చేయబోయే నాలుగు కొత్త పథకాలకు గ్రామ సభలు ఏర్పాటు చేసి అందరికీ తెలిసే విధంగా పథకాలు అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలది కీలకపాత్ర

గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక, ఖరారు జరుగుతుందని, గ్రామసభల్లోని అర్హులైన వారికి పథకాల అనుమతి పత్రాలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అందజేస్తారని తెలిపారు. ప్రభుత్వ జీవో ప్రకారం సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా లేదా అనేది ఇందిరమ్మ కమిటీలు పర్యవేక్షిస్తాయన్నారు. సంక్షేమ పథకాల అమలులో వీరు కీలకమని డిప్యూటీ సీఎం తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు, అర్హుల జాబితా అన్నీ కూడా జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం ఉండాల్సిందే అని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల పేర్లు, వారు పొందిన నగదు మొత్తాన్ని అందరికీ కనిపించేలా పెద్ద అక్షరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, మొత్తం మూడు పథకాలకు సంబంధించి మూడు ఫ్లెక్సీలు, విడివిడిగా పెద్దగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకాల అమలులో కలెక్టర్లకు ఎలాంటి సందేహాలు ఎదురైనా జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

Next Story

Most Viewed