Deputy CM Bhatti: సామాజిక, ఆథ్యాత్మిక చైతన్యానికి కేరళ కేంద్ర బిందువు

by Gantepaka Srikanth |
Deputy CM Bhatti: సామాజిక, ఆథ్యాత్మిక చైతన్యానికి కేరళ కేంద్ర బిందువు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాంస్కృతిక సమానత్వానికి, ఆర్థిక చైతన్యానికి, సామాజిక పరివర్తనకు కేరళ కేంద్ర బిందువని కీర్తించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క... అక్కడి ఆలయాల్లోనూ ఇది ప్రతిబింబిస్తూ ఉన్నదన్నారు. నారాయణ గురు, అయ్యం కాళీ వంటి ఎంతోమంది సంఘ సంస్కర్తలు చేసిన అవిరళ కృషితో సామాజిక న్యాయభావనకు బీజాలు పడ్డాయన్నారు. సామాజిక, ఆథ్యాత్మిక చైతన్యం కేరళ అంతటా కనిపిస్తుందని, ప్రజల సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగంగా ఉన్నదన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళప్పుళ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఓచిర పరబ్రహ్మ ఆలయంలో 400 మందికి జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆయన అక్కడి సామాజిక చైతన్య స్ఫూర్తిని ప్రస్తావించారు. తెలంగాణలోని సామాజిక పరిస్థితులతోనూ కేరళకు చాలా అంశాల్లో సారూప్యత ఉన్నదన్నారు.

తెలంగాణలోనూ ఒక సంఘర్షణ లోనుంచి సంస్కరణలు ఉద్భవించాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. తెలంగాణకు స్ఫూర్తిదాయక పోరాట చరిత్ర ఉన్నదని, సాయుధ రైతాంగ పోరాటాల నుంచి సామాజిక సంస్కరణల దాకా అడుగడుగునా ఆ చైతన్యం కనిపిస్తుందన్నారు. అదే రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన ఉద్యమంలోనూ రిఫ్లెక్టు అయిందన్నారు. భూస్వామ్య పెత్తందారీ సంకెళ్ల నుంచి సమాజాన్ని మేల్కొల్పి సామాజిక సమానత్వం దిశగా నడపడానికి తెలంగాణలో జరిగిన కొన్ని ఉద్యమాల గురించి ఆ సందర్నంగా వివరించారు. ఆలయంలో 400 జంటలకు సామూహిక వివాహాలు జరగడం ఒక వ్యక్తిగత వేడుక కాదని, సామాజిక ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని అన్నారు. కేవలం కుటుంబాలతో ముడిపడిన కార్యక్రమం మాత్రమే కాదని, సమానత్వ విలువలకు తార్కాణంగా నిలిచి వివిధ సెక్షన్ల ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చే సోషల్ ఈవెంట్ అని కొనియాడారు.

సమైక్యతకు, ప్రగతిశీల భావనలకు, సామాజిక, ఆధ్యాత్మిక చైతన్యానికి ఓచిర పరబ్రహ్మ ఆలయం కేంద్ర బిందువు అని అన్నారు. కొన్నేండ్లుగా ఈ ఆలయం నిర్వహిస్తున్న సామూహిక వివాహాలు ఇక్కడి సమాజంలో సమానత్వం కోసం జరిగిన అనేక ఉద్యమాలను గుర్తుకు తెస్తున్నదన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలను వివక్ష లేని తీరులో ఒక్క తాటిమీదకు తెచ్చి వివాహాలు జరిపించడం సామాజిక స్ఫూర్తికి నిదర్శనమన్నారు. సమాజం పట్ల ఉన్న ధాతృత్వాన్ని, ప్రేమను బాధ్యతను ఈ ఆలయం ప్రదర్శిస్తున్నదని పేర్కొని నిర్వాహకులను కొనియాడారు. సామాజిక న్యాయాన్ని నిలబెట్టే బాధ్యతతో ఈ ఆలయం చేస్తున్న కృషి ఆదర్శనీయమన్నారు. మానవీయ విలువలను నమ్మి ఆచరించడం అందరి కర్తవ్యంగా ఉండాలని, మనుషుల నేపథ్యంతో, కులంతో, ఆర్థిక స్తోమతతో, రంగుతో, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండేందుకు ఇలాంటి కార్యక్రమం దోహదపడుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed