Minister Ponnam : బకాయిల పేరుతో విద్యార్థుల విద్యాహక్కు హరించడం సరికాదు

by Kalyani |
Minister Ponnam : బకాయిల పేరుతో విద్యార్థుల విద్యాహక్కు హరించడం సరికాదు
X

దిశ, జహీరాబాద్: గురుకుల పాఠశాలలు, కళాశాలల కిరాయి బకాయిలు 30, 40 నెలలుగా ఉన్నది వాస్తవమేనని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దానికి పాఠశాలలకు తాళాలు వేయించడం, రీయింబర్స్ మెంట్ కోసం కళాశాలలు బంద్ చేయడం పట్ల తీవ్రంగా స్పందించారు. కావాలని ఇదంతా చేయిస్తున్నారని విమర్శించారు. నిరసన తెలిపే హక్కు వారికుంది, కానీ పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా తరగతులు నిర్వహించాలన్నారు. కళాశాలలో మూసేసి హక్కులు అడిగితే కఠినంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. బకాయి సొమ్మును చెల్లించేందుకు ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. బకాయిల పేరుతో విద్యార్థుల విద్యా హక్కు హరించాలని చూస్తే మాత్రం ఊరుకోమన్నారు. చదువులకు ఆటంకం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లు ఈ బాధ్యత తీసుకుంటారన్నారు. బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు.

నియోజకవర్గ కేంద్రంలో పరిపాలన సౌలభ్యం కోసం పార్లమెంట్ క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం హర్షనీయమని, సమస్యల సత్వర పరిష్కారానికి దీంతో వీలవుతుందని అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకొని వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంలో క్యాంపు కార్యాలయాల ప్రారంభోత్సవం శుభసూచకమన్నారు. కార్యకర్తలు , ప్రజల్లో విశ్వాసం కలుగుతుందన్నారు. ప్రోటోకాల్ ఇబ్బంది కూడా తలెత్తకుండా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ స్థల సేకరణ చేపట్టనుంది అన్నారు. ప్రభుత్వ ధర ప్రకారం వెలకట్టి భూసేకరణ చేసి పార్టీ కార్యాలయం నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ చూపి ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మాణ బాధ్యత తీసుకుంటారన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.

జహీరాబాద్ లో ఎంపీ క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవానికి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయం ప్రారంభించారు. ఇందుకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు, పాటిల్, రామలింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి, ఖాజామియా, కార్మిక నాయకులు ఎంజీ.రాములు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story