సౌత్ గ్రూపుపైనే ఈడీ ఫోకస్.. పాలసీ డాక్యుమెంట్ లీక్‌పై ప్రత్యేక దృష్టి!

by GSrikanth |
సౌత్ గ్రూపుపైనే ఈడీ ఫోకస్.. పాలసీ డాక్యుమెంట్ లీక్‌పై ప్రత్యేక దృష్టి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దృష్టంతా ‘సౌత్ గ్రూపు’ పైనే పెట్టింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన నుంచి సౌత్ గ్రూపుతో జరిగిన సంప్రదింపులు, ముసాయిదా డాక్యుమెంట్ ముందుగానే లీక్ కావడం, అనుకూలంగా ఉండేలా మార్పులు చేర్పులు చేసేలా సౌత్ గ్రూపు పోషించిన పాత్ర తదితరాలపైనే ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగస్వామ్యం ఉన్న వారిని విచారణకు పిలిచి ఆరా తీస్తున్నారు. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు. ఇప్పటికే పలు ఆధారాలు, డిజిటల్ ఎవిడెన్సులు, డాక్యుమెంట్లు, చాటింగ్ స్క్రీన్ షాట్లు, కాల్ డేటా హిస్టరీని రెడీ చేసుకున్న ఈడీ.. ప్రస్తుతం ఒక్కొక్కరి నుంచి స్టేట్‌మెంట్ల రూపంలో సాక్ష్యాలను సేకరిస్తున్నది.

సౌత్ గ్రూపు ప్రమేయాన్ని ఎంత లోతుగా విశ్లేషించి వివరాలను రాబడితే ఈ స్కామ్‌ దర్యాప్తు ఆ మేరకు సక్సెస్ అవుతుందని ఈడీ భావన. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో సౌత్ గ్రూపుతో సంబంధం ఉన్నవారిపైనే ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ గ్రూపుతో సంబంధం ఉన్న అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు రాఘవను ఈడీ అరెస్టు చేసింది. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సైతం విచారిస్తూ ఉన్నది. ఈడీ సేకరించిన డిజిటల్ ఎవిడెన్సులకు అనుగుణంగా వీరి నుంచి వివరాలను రాబట్టిన తర్వాత కొత్తగా ఎవరి పేర్లు తెరపైకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపైన ఎవరికి నోటీసులు జారీ అవుతాయి, వారి నుంచి ఎలాంటి ఆధారాలు లభిస్తాయన్నది కీలకంగా మారింది.

వాస్తవాలను రాబట్టే దిశగా ఎంక్వయిరీ

లిక్కర్ కేసులో సౌత్ గ్రూపుదే కీలక పాత్ర అని బలంగా అనుమానిస్తున్న ఈడీ.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.వందల కోట్ల మేర అడ్వాన్స్ కిక్‌బ్యాక్ రూపంలో ముడుపులు అందినట్టు నిర్ధారించుకున్నది. ఆ డబ్బు ఎవరి నుంచి ఎవరి ద్వారా ఎవరికి చేరింది, ఇందులో లెక్కల్లోకి రానిది ఎంత, హవాలా మార్గంలో రవాణా తదితరాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ ఉల్లంఘనలు జరిగాయన్న కోణం నుంచే వివరాలను రాబడుతున్నది. దానికి అవసరమైన బ్యాంకు స్టేట్‌మెంట్లు, కంపెనీల ఆడిట్ రిపోర్టులు, వ్యక్తిగత ఆస్తుల వివరాలు, ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటన్ తదితరాలన్నింటినీ విచారణకు తీసుకురావాల్సిందిగా సౌత్ గ్రూప్ వ్యక్తులను ఆదేశిస్తున్నది. వాటిని విశ్లేషించిన తర్వాత మరిన్ని వివరాలను వారి నోటి నుంచే చెప్పించే ప్రయత్నం చేస్తున్నది. సౌత్ గ్రూపునకు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు ఢిల్లీ ఎక్సయిజ్ శాఖకు మధ్య జరిగిన సంభాషణలు, సంప్రదింపులు, రహస్య ఒప్పందాలు, చేతులు మారిన డబ్బు తదితరాల గురించి ఎక్కువగా ఆరా తీస్తున్నది. విచారణలో సహకరించడం లేదన్న కారణంగా అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నది. చాలా సందర్భాల్లో వాస్తవాలను వెల్లడించడం లేదని కోర్టుకు వివరిస్తున్న ఈడీ.. అప్పటికే తన దగ్గర సేకరించి పెట్టుకున్న ఆధారాలను వారి ముందు ఉంచి సమాధానాలను తీసుకుంటున్నది. ఇందుకోసం సిగ్నల్ యాప్ ద్వారా ఎక్సయిజ్ పాలసీ ముసాయిదా డాక్యుమెంట్లు మూడో కంటికి తెలియకుండా సౌత్ గ్రూపు సభ్యులకు చేరవేయడాన్ని సీరియస్‌గా తీసుకున్నది.

క్రాస్ ఎగ్జామినేషన్ తరహాలో విచారణ

ఆధారాలను ఒక్కొక్కరి ముందు పెట్టి విడివిడిగా ఎంక్వయిరీ చేస్తున్నా వాస్తవాలు వెలుగులోకి రావడంలేదన్నది ఈడీ వాదన. హోటళ్లలో జరిగిన మీటింగులు, దాన్ని ధ్రువీకరించే వీడియో ఫుటేజీ, వ్యక్తుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్, ఫేస్ టైమ్‌లో ఎవరు ఎవరితో మాట్లాడారనే వివరాలు, మొబైల్ ఫోన్లను తరచూ మార్చడంతో పాటు వాటిలోని డిజిటల్ ఎవిడెన్సులను ధ్వంసం చేయడం తదితరాలన్నింటి సమాచారం ఈడీ దగ్గర ఉంది. వివరాల కోసం వారిని విడివిడిగా చేస్తున్న ఎంక్వయిరీలో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తున్నారన్న ఉద్దేశంతో జాయింట్‌గా విచారణ జరపాలని డిసైడ్ అయింది.

అందులో భాగంగానే పిళ్లయ్ కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. సౌత్ గ్రూపులోని వ్యక్తులను మనీ లాండరింగ్ కోణం నుంచి ప్రశ్నించాల్సి ఉన్నదని, ఈ గ్రూపులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ప్రతినిధిగా ఉన్న ఆడిటర్ బుచ్చిబాబును సైతం ఈ నెల 15న ప్రశ్నించడానికి నోటీసులు ఇచ్చిన విషయాన్ని న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీచేసినా వాయిదా వేశారని, చివరకు బుధవారం హాజరవుతున్నారని తెలిపారు. పిళ్లయ్‌ను ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నా కొన్ని అంశాలపై పొంతనలేని సమాధానాలను ఇస్తున్నారని, ఆధారాలను చూపించినా దాటవేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ కారణంగానే బుచ్చిబాబు గతంలో పిళ్లయ్‌ ప్రమేయం గురించి వివరిస్తూ చెప్పిన స్టేట్‌మెంట్ ప్రకారం ప్రశ్నించినా వాస్తవాలు రాకపోవడంతో ఇద్దరినీ కలిపి జాయింట్‌గా విచారించాలని (క్రాస్ ఎగ్జామినేషన్ తరహాలో) అనుకుంటున్నట్టు ఈడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

జాయింట్ విచారణతో రాబట్టేదేంటి?

ప్రస్తుతానికి పిళ్లయ్, బుచ్చిబాబును జాయింట్‌గా విచారించాలని ఈడీ ఓపెన్‌గానే చెప్పేసింది. ఎమ్మెల్సీ కవితను ఈ నెల 11న విచారించిన సందర్భంగా పిళ్లయ్‌ను కూడా కూర్చోబెట్టి కొద్దిసేపు ఎంక్వయిరీ చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. కానీ ఈడీ వర్గాలు మాత్రం దానిని ధ్రువీకరించలేదు. ఈ నెల 15న పిళ్లయ్, బుచ్చిబాబు జాయింట్ విచారణ తర్వాత కవితను ఎంక్వయిరీ చేసేటప్పుడూ ఇలాంటి విధానాన్నే అవలంబిస్తుందేమోననే వార్తలు వినిపిస్తున్నాయి. సౌత్ గ్రూపుతో సంబంధం ఉన్న వ్యక్తులకు విచారణ తేదీలను ఖరారు చేయడాన్ని పరిశీలిస్తే పిళ్లయ్, బుచ్చిబాబు, కవితలను ఒకేచోట కూర్చోబెట్టి ముఖాముఖిగా విచారించే చాన్స్ ఉన్నది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కస్టడీ ముగిసేలోపు ఆయనతోనూ జాయింట్ విచారణను తోసిపుచ్చలేమని ఈడీ వర్గాల వాదన.

ఈడీ విచారణ సందర్భంగా లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపు, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సంబంధాలపై రాబట్టాలనుకుంటున్న కొన్ని అంశాలు ఇవీ...

- లిక్కర్ పాలసీ ముసాయిదా డాక్యుమెంట్ ముందుగానే కొద్దిమంది వ్యక్తులకు ఎలా చేరింది?

- వీటిని పంపినవారిలో ఢిల్లీ ఎక్సయిజ్ శాఖ లేదా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారెవరు?

- ముసాయిదా డాక్యుమెంట్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు సౌత్ గ్రూపుతో ఉన్న సంబంధమేంటి?

- ఆమ్ ఆద్మీ పార్టీతో వీరికి ఎంత కాలంగా సంబంధాలు ఉన్నాయి? ఏ అవసరాల కోసం?

- ఎక్సయిజ్ పాలసీని లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా రూపకల్పన చేసినందుకు ఇరు పక్షాల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలేంటి? ఎవరి నుంచి ఎవరికి ఎంత ముడుపులు అందాయి?

- ఆ ఆర్థిక వనరులను పంపినవారు ఎక్కడి నుంచి సేకరించారు?

- వారి బ్యాంకు లావాదేవీల్లో పూర్తి వివరాలు ఎందుకు కనిపించడంలేదు?

- హవాలా రూపంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత డబ్బు తరలింది? వాటిని పంపింది, తీసుకున్నది ఎవరు?

- వాట్సాప్ చాటింగ్‌తో పాటు సిగ్నల్ మొబైల్ యాప్‌లో షేర్ చేసుకున్న అంశాలేంటి?

- స్క్రీన్ షాట్‌లలోని వివరాల ప్రకారం వాస్తవాలు ఎందుకు వెల్లడించడంలేదు?

- ఫోన్లు తరచూ ఎందుకు మార్చాల్సి వచ్చింది? అందులోని డిజిటల్ ఎవిడెన్సులు దొరకకుండా మాయం చేయాల్సిన అవసరమేంటి?

- ఒకరు చెప్పిన సమాధానం మరొకరి జవాబుతో ఎందుకు రూఢీ కావడంలేదు?

- జాయింట్ ఎంక్వయిరీ ద్వారా మాత్రమే సాధ్యమయ్యే పరిస్థితి ఎందుకు ఉత్పన్నమవుతున్నది?

ఇలాంటి వివరాలపైనే ఈడీ దృష్టి పెడుతున్నది. ఇకపైన జరిగే ఎంక్వయిరీలలో ఇవే కీలకంగా ఉంటాయని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈడీ దగ్గర తగిన ఆధారాలు, గతంలో కొద్దిమంది ఇచ్చిన స్టేట్‌‌మెంట్లు ఉన్నప్పటికీ పూర్తి వివరాలను వారి మాటల ద్వారానే రాబట్టడానికి ఎంక్వయిరీలపై ఫోకస్ పెట్టింది. రానున్న వారం రోజుల్లో జరిగే పలువురి విచారణ, వారి నుంచి రాబట్టే వివరాలకు అనుగుణంగా ఇంకా ఎవరెవరు కొత్తగా తెరపైకి వస్తారనేది కీలకంగా మారింది. ఎంక్వయిరీ తర్వాత ఈడీ అరెస్టులు, కస్టడీ లాంటి నిర్ణయాలు తీసుకుంటుందేమోననే ఆందోళన కొద్దిమందిలో మొదలైంది.

Advertisement

Next Story