అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.. వారెంట్ ఇవ్వకుండా జైల్లో ఉండగానే అరెస్టు

by GSrikanth |
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.. వారెంట్ ఇవ్వకుండా జైల్లో ఉండగానే అరెస్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ, ఈడీ అధికారులు ఇష్టానుసారం నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఢిల్లీ హైకోర్టులో సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తరఫున విక్రమ్ చౌదరి వాదించారు. సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కఠిన చర్యలు తీసుకోబోమంటూ ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అండర్‌టేకింగ్ ఇచ్చారని, అయినా దాన్ని ఉల్లంగించి ఆమెను అరెస్టు చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. కవిత వేసిన రిట్ పిటిషన్ కారణంగానే దర్యాప్తు ముందుకు సాగడంలేదంటూ సుప్రీంకోర్టుకు ఈడీ లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎఫ్ఐఆర్‌లో ఆమె పేరు లేకపోయినప్పటికీ తొలుత సీఆర్పీసీ 161 కింద నోటీసులు ఇచ్చిన సీబీఐ.. ఆ తర్వాత సీఆర్పీసీ 41-ఏ కింద జారీచేసిందని ఆయన గుర్తుచేశారు.

మరోవైపు ఈడీ అరెస్టు చేసిన కేసులో తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉండగానే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆమెను అరెస్టు చేసిందని వాదించారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం కవితను విచారించాలని సీబీఐ భావిస్తే తొలుత ఆ అంశాన్ని ఆమెకు వివరించాలని గుర్తుచేశారు. ఆమెను ప్రశ్నించడానికి రౌస్ ఎవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిందని, కానీ ఈ సమాచారాన్ని ఆమెకు తెలియజేయలేదన్నారు. నిబంధనల ప్రకారం ఆమె వాదనను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే తదుపరి కార్యాచరణ ఉండాలని అన్నారు. రౌస్ ఎవెన్యూ కోర్టు సైతం సీబీఐ అధికారులకు కవితను అరెస్టు చేయడానికి అనుమతి ఇచ్చిందని, కానీ కోర్టు నుంచి కూడా ఆమెకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందలేదని గుర్తుచేశారు. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగిందన్నారు.

కల్వకుంట్ల కవిత సీబీఐ, ఈడీ అరెస్టులను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేసి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరారు. వాటిని జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ గత వారం విచారణకు స్వీకరించి సోమవారం కవిత వాదనలను వింటామని, ఆ తర్వాతి రోజు సీబీఐ, ఈడీ వాదనలను వింటామని స్పష్టం చేసింది. ఆ ప్రకారం కవిత తరఫున విక్రమ్ చౌదరి సీరియస్ వాదలను వినిపించారు. రెండు పిటిషన్లను కలిపి విచారణకు స్వీకరించడంతో ఆయన వాదనలు కంప్లీట్ అయ్యాయి. సీబీఐ, ఈడీ తరఫున వాదనలను వినిపించాలని వాటి తరఫున హాజరైన న్యాయవాదులకు జడ్జి అవకాశం ఇచ్చినా తగిన ఆధారాలతో మంగళవారం వాదనలను వినిపిస్తామని అనుమతి పొందారు.

కవిత అరెస్టు చట్టవిరుద్ధం : విక్రమ్ చౌదరి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో రెండు దర్యాప్తు సంస్థలు చట్టవిరుద్ధంగా అరెస్టు చేశాయని ఆమె తరపు లాయర్ విక్రమ్ చౌదరి ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. మహిళలను విచారించేటప్పుడు ఎలాంటి విధానాలను అవలంబించాలో తెలియజేయాలని కోర్టును కోరారు. సీఆర్పీసీలో మాత్రం స్పష్టమైన వివరణే ఉన్నదని, వీటినే గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రస్తావించామన్నారు. ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగానే ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్‌ స్పష్టమైన అండర్‌టేకింగ్ ఇచ్చారని గుర్తుచేశారు. దర్యాప్తు సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చిందన్నారు. తదుపరి విచారణ జరిగేంతవరకూ సమన్లు ఇవ్వబోమంటూ అడిషనల్ సొలిసిటర్ జనరల్ స్పష్టంగా సుప్రీంకోర్టుకు వివరించారని గుర్తుచేశారు.

కానీ ఈ హామీకి విరుద్ధంగా అకస్మాత్తుగా సోదాల పేరుతో ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు తనిఖీలు చేయడంతో పాటు అరెస్టు చేశారని జస్టిస్ స్వర్ణకాంత శర్మకు వివరించారు. యాధృచ్ఛికంగా అదేరోజున సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్2పై విచారణ జరిగిందని, ఇకపై ఎలాంటి రిలీఫ్ దొరకదు... అంటూ అదనపు సోలిసిటర్ జనరల్ చెప్పిన గంటల వ్యవధిలోనే ఆ రోజు సాయంత్రం కవితను అరెస్టు చేసిందన్నారు. మద్యం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కవిత పేరు నిందితుల జాబితాలో లేదని, కానీ ఊహకు అందని విధంగా రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన వేర్వేరు చార్జిషీట్లలో ఈడీ, సీబీఐ అధికారులు ఆమె పేరును ప్రస్తావించారని, కీలక సూత్రధారి అంటూ అభియోగాలు మోపాయన్నారు. అరెస్టు తర్వాత బెయిల్ ఇవ్వడానికి కూడా ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వలేదన్నారు.

చదువుకుంటున్న ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారని, వారికి వార్షిక పరీక్షలు జరుగుతున్నాయని ట్రయల్ కోర్టుకు వివరించానా కనికరం చూపలేదని జస్టిస్ స్వర్ణకాంత శర్మ దృష్టికి తీసుకెళ్ళారు. పార్టీలో ముఖ్య నాయకురాలిగా, ఎమ్మెల్సీగా ఉన్న ఆమెపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి అరెస్టు చేశారని తెలిపారు. ఒక మహిళగా ఆమెకు ఉన్న హక్కుని కూడా కాలరాసే విధంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించాయని ఆరోపించారు. మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసినట్లు కూడా ఆరోపించారని, వాస్తవానికి వాడకుండా ఉండిపోయిన ఫోన్లను తెలిసినవారికి ఇస్తే ఫార్మాట్ చేసుకుని వాడుకుంటే కూడా ఆ అభియోగాన్ని ఆమెపై మోపాయని పేర్కొన్నారు. దానికి కవిత ఎలా బాధ్యురాలు అవుతారని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.

కేవలం రాజకీయ కక్షపూరిత విధానంతోనే ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ కేసు నమోదు చేసిందని విక్రమ్ చౌదరి వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఆమెకు సంబంధం లేనందువల్ల ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన ఉత్తర్వుల స్థానంలో ఆమెకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరి వాదనలను కంప్లీట్ చేశారు. అనంతరం వాదనలు వినిపించాల్సిందిగా సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాదులను జస్టిస్ స్వర్ణకాంత శర్మ అవకాశం ఇచ్చారు. కానీ తగిన ఆధారాలతో మంగళవారం విచారిస్తామని గడువు కోరడంతో అంగీకరించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ... దర్యాప్తు సంస్థల వాదనల తరవాత తీర్పును రిజర్వ్ చేస్తామని ప్రకటించారు. దర్యాప్తు సంస్థల వాదనల తర్వాత రిజాయిండర్ వాదనలకు అవకాశం ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది రిక్వెస్టుకు జస్టిస్ శర్మ సానుకూలంగా స్పందించారు. తదుపరి విచారణ మంగళవారం కంటిన్యూ కానున్నది.

అరుణ్ పిళ్ళై పిటిషన్ డిస్మిస్ :

ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ అభియోగాలతో అరెస్టయిన అరుణ్ రామచంద్రన్ పిళ్ళై బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ట్రయల్ నిర్వహిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందని, దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించానని, అక్కడ కూడా తనకు చేదు అనుభవమే ఎదురైందని, తన పిటిషన్‌ను కొట్టివేసిందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పిళ్ళై వివరించారు. ఢిల్లీ హైకోర్టు ఈ నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని తాజా పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు. హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులను తాము పరిగణనలోకి తీసుకోబోమని, ఏ విషయం చెప్పాలనుకున్నా... వివరణ కోరాలనుకున్నా ఢిల్లీ హైకోర్టులో ఆశ్రయించి అక్కడే చెప్పుకోవాలని సుప్రీంకోర్టు జస్టిస్ అభయ ఎస్ ఓఖా స్పష్టం చేశారు. మధ్యంతర బెయిల్ లేదా రెగ్యులర్ బెయిల్ కోరాలనుకున్నా హైకోర్టునే సంప్రదించాలని పేర్కొని పిళ్ళై పిటిషసన్‌ను కొట్టివేసింది.

Advertisement

Next Story

Most Viewed