ట్యాంక్ బండ్‌పై ‘దశాబ్ది’ సంబురం.. భారీ సెట్టింగ్స్.. 1.5 కిలోమీటర్ల పొడవున స్టాల్స్

by Ramesh N |
ట్యాంక్ బండ్‌పై ‘దశాబ్ది’ సంబురం.. భారీ సెట్టింగ్స్.. 1.5 కిలోమీటర్ల పొడవున స్టాల్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించి.. సికింద్రబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జాతియ జెండా ఆవిష్కరించారు. అనంతరం కవి అందెశ్రీ రచించిన రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ పాటను జాతికి అంకితం చేశారు. ఈ క్రమంలోనే సీఎం ప్రసంగం మధ్యాహ్నం వరకు పరేడ్ గ్రౌండ్‌లో ఉత్సవాలు ముగిశాయి.

మిరుమిట్లు గొలిపే లైట్లతో ట్యాంక్ బండ్‌పై ఉత్సవాలకు సిద్దమైంది. ప్రజలు ట్యాంక్ బండ్ వద్దకు ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. సాగర తీరన భారీ సెట్టింగ్స్‌తో స్టేజ్ వేశారు. 1.5 కిలోమీటర్ల పొడవున తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్​ స్టాల్స్​ 80 ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి ట్యాంక్​బండ్​కు చేరుకొని అక్కడి స్టాళ్లను సందర్శిస్తారు. రాత్రి 7 గంటల నుంచి సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్​ నిర్వహిస్తారు.

అనంతరం 7:20 గంటల నుంచి 17 కళల సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఉంటాయి. రాత్రి 8:30 గంటలకు దాదాపు 5వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్​బండ్​పై భారీ ఫ్లాగ్​వాక్​ నిర్వహిస్తారు. అది జరుగుతుండగా జయ జయహే తెలంగాణ గీతాన్ని ప్లే చేస్తారని షెడ్యూల్లో ఉంది. కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని ఈ సందర్భంగా సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటల నుంచి పది నిమిషాల పాటు హుస్సేన్​ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు ట్యాంక్​బండ్​పై వేడుకలు ముగుస్తాయి.

Advertisement

Next Story

Most Viewed