ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథంను వరించిన దాశరథి కృష్ణమాచార్య అవార్డ్

by Satheesh |
ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథంను వరించిన దాశరథి కృష్ణమాచార్య అవార్డ్
X

దిశ, సిటీ బ్యూరో: ప్రముఖ రచయిత, కవి జూకంటి జగన్నాథంను మరో అరుదైన పురస్కారం వరించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూకంటికి కవి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం-2024ను ప్రకటిస్తూ శనివారం జీవో నెం.199 ను విడుదల చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో జన్మించిన జూకంటి కలం నుంచి జాలువారిన ఎన్నో రచనలు, కవిత్వాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. కవిత్వ సంకలనాలు, కథా సంకలనాలు రచనలో తనదైన విశేష ముద్ర వేసుకున్న జూకంటిని మొట్టమొదటి సారిగా వలస శీర్షికతో ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి పోటీలలో పాల్గొని ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్న ఆయన రచన ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. సృజనాత్మక ప్రక్రియలకు తెలుగు విశ్వవిద్యాలయం 2002లో యూనివర్శిటీ ట్రస్టీ అవార్డును బహుకరించి, సాదరంగా సన్మానించుకుంది.

లేటెస్టుగా ఆయన 2020 సంవత్సరానికి గాను జాతీయ అవార్డు గ్రహీత డా. సి.నారాయణరెడ్డి పురస్కారాన్ని కూడా స్వీకరించారు. 2007 నుంచి 2013 వరకు తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులుగా కూడా సేవలందించిన జూకంటి ఇప్పటి వరకు 16 కవిత్వం సంకలనాలను రచించారు. 2005లో జూకంటి కథలు, 2020లో జూకంటి జగన్నాథం కథలు సాహితీ ప్రియుల మన్ననలు అందుకున్నాయి. ఆయన రచించిన కవిత్వ సంకలనంలో మొదటికి పాతాళ గంగను 1993లో రచించగా, తాజాగా 2020లో సద్దిముల్లె అనే కవిత్వ సంకలనాన్ని రచించి, సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నారు.

ఆయన రచించిన కవిత్వం సంకలనాలు కన్నడ, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లోనూ అనువాదానికే గాక, సాహితీ ప్రియుల అభిమానానికి నోచుకున్నాయి. దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక "శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు" 2024 సంవత్సరానికి గాను జూకంటి జగన్నాథంకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అవార్డుతో పాటు 1 లక్షా 1,116 రూపాయల నగదు, జ్ఞాపికను అవార్డు గ్రహీతకు అందజేస్తారు. ఈ సందర్భంగా జగన్నాథం కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed