- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IAS అవ్వాలనుకుని పాలిటిక్స్‌లోకి.. దామోదర రాజనర్సింహ ప్రస్థానమిదే..!
దిశ, అందోల్: ఐఏఎస్ అవాలనుకున్న ఆయన అనుకొని పరిస్థితుల్లో అనుహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. 34 ఏండ్లుగా అందోల్ ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎమ్మెల్యే నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన నేతగా అందరి మన్ననలు పొందుతూ అంచలంచెలుగా ఎదిగిన నాయకుడిగా మంచిపేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు అందోలు ఎమ్మెల్యే సీలారపు దామోదర రాజనర్సింహ.
దివంగత మంత్రి రాజనర్సింహ–జానాబాయి దంపతుల రెండో కూమారుడు సీలారపు దామోదర 1958 డిసెంబరు 5న జన్మించాడు. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన ఆయన ఐఏఎస్ కావాలని పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు కూడా సిద్దమయ్యారు. తనకు రాజకీయ భవిష్యత్‌నిచ్చిన అందోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అనునిత్యం పరితపించాడు. చదువుపై ఉన్న మక్కువతో అందోలు ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హాబ్‌గా మార్చారు. అనేక విద్యాసంస్థలను ఈ ప్రాంతంలో నెలకొల్పాడు.
జేఎన్‌టీయూ, పాలిటెక్నిక్, మహిళ పాలిటెక్నిక్, మహిళ వ్యవసాయ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు, మోడల్ స్కూళ్లు ఇలా అనేక విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చిన దామోదర దళితుల అభ్యున్నతికి పాటుపడ్డాడు. రైతులు పండించిన పంటలను విక్రయించుకునేందుకు వారికి అనుకూలంగా నియోజకవర్గంలో వట్‌పల్లి, రాయికోడ్‌లలో కొత్తగా మార్కెట్ యార్ఢులను ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి అధిష్టానాన్ని ఒప్పించిన ఘనత దామోదరకే దక్కుతుంది. విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాకుండా అనేక సబ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా కోసం లింకు రోడ్లను, కొత్త రోడ్లను ఏర్పాటు చేసి, రవాణా వ్యవస్థను మెరుగుపరిచారు. అందోలు ప్రజల్లో చెదరని ముద్రను వేసుకున్న దామోదర్ జన్మదిన వేడుకలను నేడు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.
నాల్గవ సారి ఎమ్మెల్యేగా..
1989లో ఆయన తండ్రి మాజీ మంత్రి రాజనర్సింహ అకాల మరణం చెందడంతో, దామోదర రాజనర్సింహ రాజకీయాల్లోకి ప్రవేశించాల్సి వచ్చింది. 1989లో జరిగిన అందోల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు ఓటమి చెందినా, నియోజకవర్గాన్ని మాత్రం వదల్లేదు. ఇక్కడి ప్రాంత ప్రజలతో మమేకమైన అయన 2004 ఎన్నికల్లో అప్పట్లో మంత్రిగా పనిచేసిన పి.బాబూమోహన్‌పై భారీ మేజార్టీతో దామోదర్ గెలుపొందారు.
2006లో వైఎస్‌ఆర్ పాలనలో మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలుపొందిన దామోదర వైఎస్‌ఆర్, రోశయ్య హయాంలో మంత్రి వర్గంలో పనిచేశారు. 2010లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణకు ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాల్సిన సందర్భం రావడంతో 2011 జూన్ 10వ తేదీన డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు.
ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చెందగా, ఆగస్టు 20, 2023న జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వనిత సభ్యుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి క్రాంతికిరణ్‌పై విజయాన్ని సాధించి, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి కూడా రాష్ట్ర కేబినెట్‌లో కీలక పదవి వరించనున్నట్లు సమాచారం.
తన రికార్డు తానే బ్రేక్ చేసిన దామోదర..
అందోల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, ఇందులో 9 సార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలుపొందగా, వీరిలో దామోదర కుటుంబ సభ్యులు ఆరుసార్లు విజయాన్ని సాధించడం విశేషం. అయితే వీరిలో అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థి, అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందిన అభ్యర్థి సి.దామోదర రాజనర్సింహనే కావడం విశేషం.
నియోజకవర్గంలో 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి బాబూమోహన్ చేతిలో 513 అత్యల్ప ఓట్లతో దామోదర ఓటమి చెందారు. 2004వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాబూమోహన్‌ను 24,846 ఓట్ల మెజార్టీతో దామోదర్ ఓడించారు. అతిస్వల్ప ఓట్లతో ఓడిన, అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నేతగా దామోదరకు పేరు వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో వెలువడిన ఫలితాల్లో సమీప ప్రత్యర్థి క్రాంతి కిరణ్‌పై 28193 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తన రికార్డునే తానే బ్రేక్ చేసుకున్నారు.
అపరభగీరథుడిగా దామోదర..
తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన అందోలు నియోజకవర్గానికి ఏదో చేయాలన్న తపనతో, ఇక్కడి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఆకాంక్షతో దామోదర అపరభగీరథుడిగా మారారు. నియోజకవర్గంలోని పుల్కల్ మండలంలోని సింగూరు జలాలను అందోల్ప్రాంత రైతుల భూములను సస్యశ్యామలం చేసేందుకు ఉద్యమించారు.
2003లో జోగిపేటలో తహసీల్దార్ కార్యాలయం ముందు 102 రోజుల పాటు దీక్షను చేపట్టారు. 2004లో వైఎస్‌ఆర్ ప్రభుత్వంలో 2006లో సింగూర్ కాలువ పనులకు రూ.89.99 కోట్లను మంజూరు చేయించి, 2014లో కాలువ పనులను పూర్తి చేసి 40 వేల ఎకరాలకు నీటిని అందించేందుకు చెరువులను కూడా నింపడంతో దామోదర అపర భగీరథుడిగా పేరు తెచ్చుకున్నారు.