పర్మిషన్ లేకుండానే క్రషర్లు.. గుట్టలు మాయం చేస్తున్న అక్రమార్కులు

by Rajesh |
పర్మిషన్ లేకుండానే క్రషర్లు.. గుట్టలు మాయం చేస్తున్న అక్రమార్కులు
X

దిశ, లక్షెట్టిపేట: గుట్టలు కనిపిస్తే చాలు.. అక్రమార్కులు స్వాహా చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటే చాలు ప్రకృతి సంపదని కొల్లగొడుతున్నారు. ఫిర్యాదులు వెళితేనే మైనింగ్, రెవెన్యూ అధికారులు చర్యలకు దిగుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతోనే ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కుల అక్రమార్జనకు లక్షెట్టిపేట మండలంలోని గుట్టలు కరిగిపోతున్నాయి. అయినా చర్యలు చేపట్టడంలో అధికారులు దృష్టి సారించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఏం జరుగుతోంది..?

మండలంలోని పోతపల్లి గ్రామం సర్వేనెంబర్ 138లో 7.31ఎకరాల ఇనాం భూములు, సర్వే నెంబర్ 109లో 10.10 ఎకరాల పట్టా భూములున్నాయి. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ నాయకుల అండదండలతో మంచిర్యాలకు చెందిన ఓ నిర్మాణ సంస్థ ఆ భూముల్లో క్రషర్‌ని ఏర్పాటు చేసి మొరం, బండరాళ్లు తవ్వకాలు చేస్తోంది. గత నాలుగైదేళ్లుగా ఎలాంటి అనుమతులు పొందకుండా ఈ దందా చేస్తుండడంతో అక్కడ ఉన్న రెండు గుట్టలు దాదాపుగా కరిగిపోయాయి. పక్కనే ఉన్న మరో గుట్టకు ఎసురు పెట్టే యత్నాలు జరుగుతున్నాయి.

లక్షెట్టిపేట నుంచి మంచిర్యాలకు వెళ్లే 63వ నెంబర్ జాతీయ రహదారికి కూతవేటు దూరంలోనే ఈ అక్రమ క్రషర్‌తో మొరం, బండరాళ్ల తవ్వకాలు నడుస్తున్నా...అధికారుల దృష్టిలో పడకపోవడం గమనార్హం. అక్రమ క్రషర్ నిర్వహణతో పేలుడు పదార్థాలతో డ్రిల్లింగ్ చేసినప్పుడల్లా దుమ్ము, ధూళి, చిన్న చిన్న బండారాళ్ల ముక్కలు చుట్టుపక్కల రైతుల పొలాల్లో పడుతూ పనులకు ఆటంకం కలిగిస్తోంది. దీన్ని భరించలేని గ్రామస్తులు, రైతులు ఈ నెల 21న అక్రమ క్రషర్ వద్ద ఆందోళనకు దిగడంతో మైనింగ్, రెవెన్యూ అధికారుల్లో చలనం ప్రారంభమైంది.

ఘటనా స్థలానికి చేరుకుని డ్రిల్లింగ్ ట్రాక్టర్, రెండు జేసీబీలను, రెండు టిప్పర్లను సీజ్ చేశారు. గ్రామస్తులు, రైతులు ఆందోళనకు దిగితేనే తప్ప, అధికారులు స్పందించలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని మోదెల శివారులో ఉన్న గువ్వలగుట్ట సైతం రాను రానూ గుల్లవుతోంది. ఈ గుట్టలో కూడా అక్రమంగా తవ్వకాలు జరిపి అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా మొరం మట్టిని తరలించడంతో గుట్ట కనుమరుగయ్యే పరిస్థితికి చేరువవుతోంది. ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా, అనుమతులు పొందకుండా రూ.లక్షల్లో అక్రమార్కులు ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. తద్వారా అక్రమ సంపాదన పొందుతున్నారు.

కార్యదర్శి, వీఆర్ఏలు ఏం చేస్తున్నారు...?

ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏలు ఉన్నారు. ఎక్కడైనా అక్రమ మైనింగ్ తవ్వకాలు జరిగినా మండల, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం వారి విధి ధర్మం. కానీ, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు అక్రమ మైనింగ్ తవ్వకాలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం అక్రమార్కులకు వరంగా మారింది. అక్రమార్కులు బయట ఒక్కో ట్రాక్టర్ బండరాళ్ల ట్రిప్పుకు రూ. 1800 నుంచి రూ.2వేల వరకు, ఒక్కొక్క టిప్పర్ ట్రిప్పుకు రూ. 5వేల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అదే మొరం మట్టికి ఒక్కొక్క ట్రాక్టర్ ట్రిప్పుకి రూ. 600 నుంచి రూ. 800 వరకు అమ్ముకుని అక్రమ సంపాదన చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ క్రషర్ల‌పై మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దృష్టికి వస్తే చర్యలు చేపడుతున్నాం

బాలు, మైనింగ్ శాఖ ఏడి, మంచిర్యాల

ఎక్కడైనా అనుమతులు లేకుండా మొరం, కంకర, బండరాళ్ళ తవ్వకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు చేపడుతున్నాం. కాగా అంకతి పల్లిలో పట్టా భూముల్లో భూమి చదువు కోసం తవ్వకాలు చేస్తున్నారు. జీవో నెంబర్ 139 ప్రకారం పట్టా భూముల్లో రైతులు భూమి చదువు కోసం తవ్వకాలు చేపట్టవచ్చు. అయితే అక్కడ పేలుడు పదార్థాలతో తవ్వకాలు చేస్తే అది తమ పరిధిలో లేదు.. పోలీసుల పరిధిలోకి వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed