గిరిజనుల వల్ల అడవి నాశనం కాలేదు.. వారి వల్లే అడవి ధ్వంసం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

by Vinod kumar |
గిరిజనుల వల్ల అడవి నాశనం కాలేదు.. వారి వల్లే అడవి ధ్వంసం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: అడవిని నాశనం చేసింది గిరిజనులు కాదని, వాస్తవానికి అడవులను స్మగ్లర్లు, అవినీతి అటవీ అధికారులు, రాజకీయ నాయకుల అండతో నాశనం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు హక్కు పత్రాలు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించడాన్ని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. పోడు పట్టాలతో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తామని చెప్పడం సంతోషమన్నారు. గత కొంతకాలంగా కమ్యూనిస్టులు, వివిధ సంఘాలు చేస్తున్న ఉద్యమ పోరాట ఫలితమేనని పేర్కొన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీలో సీఎం ఇచ్చిన హామీని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని, వెంటనే అమలు జరిగేట్టు చూడాలని విజ్ఞప్తి చేశారు.

గిరిజనులు అడవులను ఆక్రమిస్తే పోడు పట్టాలను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారని గుర్తు చేశారు. ఒకపక్క తెలంగాణలో గ్రీన్‌ కవర్‌ పెరిగిందని, అడవి పెరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి చెబుతున్నదానికి విరుద్ధంగా గిరిజనులే అడవులను నాశనం చేస్తున్నారని మాట్లాడటం సరైంది కాదని తెలిపారు. ఆదివాసీలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కడా అడవి నాశనం కాలేదని, ఏదైనా అడవులను కాపాడుకోవడం గిరిజనులు, ప్రజలందరి బాధ్యత వహించే విధంగా ఉండాలన్నారు. గుత్తికోయలు ఎక్కడి నుంచి వచ్చిన వారికైనా చట్టప్రకారం హక్కు ఉంటుందని, తప్పు చేసిన వారు ఎవరైనా ఉంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. గుత్తికోయలను హక్కుదారులు కాదనడం సరైందికాదని, వారిపట్ల సానుకూలంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రిని కోరారు.

Advertisement

Next Story

Most Viewed