సెర్ప్ క్లస్టర్‌ కార్యకర్తలను విధుల్లోకి తీసుకోవాలి: సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ

by Satheesh |
సెర్ప్ క్లస్టర్‌ కార్యకర్తలను విధుల్లోకి తీసుకోవాలి: సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సెర్ప్‌లో పల్లె ప్రగతి సుస్థిర వ్యవసాయ జీవనోపాధుల క్లస్టర్‌లో పనిచేసిన కార్యకర్తలను విధుల్లోకి తీసుకొవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ పల్లె ప్రగతి సుస్థిర వ్యవసాయ జీవనోపాధుల క్లస్టర్‌ సెర్ప్‌లో కార్యకర్తలుగా 656 మంది పనిచేశారని తెలిపారు. 2010లో ఒక సంవత్సరం పాటు వీరికి రూ. 4 వేలు వేతనాలు ఇచ్చి టెక్నికల్‌ అసిస్టెంట్‌ వర్క్‌ పనులు చేయించుకున్నారని పేర్కొన్నారు. 2013 నుంచి 2014 వరకు రూ. 6 వేలు వేతనాలు వీరికి ఇచ్చారని, తర్వాత తిరిగి రూ.4 వేలు ఇవ్వడం జరిగిందన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమంలో 150 పైలెట్‌ మండలాలకు రెండున్నర లక్షల మంది చిన్న, సన్నకారు రైతులతో ప్రయోజనం చేకూరే విధంగా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యంలో 5,649 మహిళా రైతు గ్రూపులను ఏర్పాటు చేయడంలో వీరి భాగస్వామ్యం కూడా ఉన్నదని వివరించారు. వీరు చాలీచాలని వేతనాలతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారని, నిరుపేద వర్గాలకు చెందిన వారని, వీరిని 2016 విధుల్లో నుంచి తొలగించడం మూలంగా ఆయా కుటుంబాలు ఇప్పుడు వీధిన పడ్డాయని పేర్కొన్నారు. కావున ఎంతో నైపుణ్యం సంపాదించిన జీవనోపాధుల క్లస్టర్‌ కార్యకర్తలను విధుల్లోకి తీసుకొని ఆయా కుటుంబాలను ఆదుకోవాలని లేఖలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed