- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వీధి కుక్కల నియంత్రణేది.. ? ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వీధి కుక్కలు చేస్తున్న దాడుల తీవ్రతను నివారించడంలో, ఆ సమస్యను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వాటి నియంత్రణకు తీసుకున్న చర్యలేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వీధి కుక్కలు తరచూ చిన్న పిల్లలపై దాడులు చేయడం, గాయాలతో చనిపోతున్న ఘటనలను ప్రస్తావించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్... పరిష్కార మార్గాలను అన్వేషించి తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నారులపై వీధి కుక్కలు దాడులకు తెగబడుతూ ప్రాణాలు తీస్తున్న ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవవడంపై తీవ్రంగా స్పందించింది. జవహర్‌నగర్‌లో రెండు రోజుల క్రితం జరిగిన ఘటనను ప్రస్తావించింది. వీధి కుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను వెతకాలని స్పష్టం చేసింది.
కుక్కల దాడిలో గతేడాది ఓ చిన్నారి మృతి చెందిన ఘటనను సూమొటోగా తీసుకున్న హైకోర్టు.. పిటిషన్‌గా పరిగణించి గురువారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌కు ఇంప్లీడ్ అయ్యేలా న్యాయవాది మామిడి వేణుమాధవ్ మూడు రోజుల క్రితం ఓ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రెండింటినీ కలిపి విచారణకు స్వీకరించిన సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ హాజరై లేవనెత్తిన వాదనలపై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడుల తీవ్రతపై అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ... జీహెచ్‌ఎంసీ పరిధిలో 3.80 లక్షల కుక్కలు ఉన్నాయని, వాటిని సంరక్షణా కేంద్రాలను తరలించడం సాధ్యం కాదని కోర్టుకు వివరించారు. వీధి కుక్కల నియంత్రణలో భాగంగా నిత్యం వాటికి స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. కుక్కల దాడి ఘటనలను నివారించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో స్టెరిలైజేషన్ కోసం ఆరు కేంద్రాలు పనిచేస్తున్నాయని, రోజుకు సగటున 200 కుక్కలకు ఈ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు.
అడ్వొకేట్ జనరల్ వాదనలను సీరియస్‌గా తీసుకున్న చీఫ్ జస్టిస్... స్టెరిలైజేషన్ ద్వారా కుక్కల దాడులను ఎలా ఆపగలుగుతారని ప్రశ్నించారు. రోడ్లపై వ్యర్థాల కారణంగా కుక్కల స్వైర విహారం ఎక్కువైందని వ్యాఖ్యానించారు. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డు తరఫున హాజరైన న్యాయవాది జోక్యం చేసుకుని కుక్కలను షెల్టర్ హోమ్‌లకు తరలించడం సాధ్యం కాదంటూ అడ్వొకేట్ జనరల్ వాదన సమంజసం కాదన్నారు. షెల్టర్ హోమ్‌లకు వాటిని తరలిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో దాదాపు 90 వేల కుక్కలను షెల్టర్ హోమ్‌లలో పెట్టినట్టు హైకోర్టుకు వివరించారు. ఇరు తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్... యానిమల్ వెల్ఫేర్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్టేట్ లెవల్ కమిటీలు సమన్వయం చేసుకుని కుక్కల దాడులకు పరిష్కారం కనుగొనాలని స్పష్టం చేశారు. తదుపరి విచారణ వచ్చే వారం జరగనున్నందున ఆ ప్రత్యామ్నాయ మార్గాలను కోర్టుకు వివరించాలని ఆదేశించారు.