పండుగకు కూడా పస్తులే.. కష్టాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు!

by karthikeya |
పండుగకు కూడా పస్తులే.. కష్టాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అటు కాంట్రాక్ట్ రెన్యువల్ అవ్వక, ఇటు మూడు నెలలుగా జీతం రాక సతమతమవుతున్నారు. డిగ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రతి ఏటా జూలై‌లోపే రెన్యువల్ చేస్తారు. కానీ ఈసారి అక్టోబర్ వచ్చినా ఈ ప్రక్రియ పూర్తవకపోవడం గమనార్హం. ఫిబ్రవరి నుంచి ఈ రెన్యువల్‌కు సంబంధించిన ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. ఫిబ్రవరిలో కమిషనర్ ఆఫీస్ నుంచి ఉన్నత విద్యామండలికి చేరుకున్న ఆ ఫైల్ అక్కడి నుంచి ఫైనాన్స్ కమిషన్ అప్రూవల్‌కు వెళ్లింది. కానీ వారు ఇప్పటికి మూడుసార్లు రిటన్ పంపించారు. ఎందుకు రిటన్ పంపించారనే దానిపై కూడా కనీసం సమాచారం లేకపోవడం గమనార్హం. సరైన వివరాలు లేవని రిటన్ చేశారా? ఏంటనే వివరాలు కూడా తెలియరాలేదు. దీనిపై మంత్రులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా రెన్యువల్ మాత్రం అవ్వడం లేదని చెబుతున్నారు.

త్వరగా రెన్యువల్ చేయాలని డిమాండ్

స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ విభాగాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్ల రెన్యువల్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల రెన్యువల్ ప్రక్రియపై మాత్రం ఎలాంటి ముందడుగు పడటం లేదు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా బుర్రా వెంకటేశం కొనసాగుతున్నారు. ఆయనకు ఇతర అదనపు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా ఆలస్యమవుతుందా? అనే అనుమానాలను కాంట్రాక్ట్ లెక్చరర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలస్యానికి కారణం ప్రభుత్వానిదా? లేక అధికారులదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ విభాగంలో రెన్యువల్ చేసి డిగ్రీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి మొండిచేయి చూపడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా రెన్యువల్ ప్రక్రియను పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆగస్టు నుంచి శాలరీ పెండింగ్:

రాష్ట్రంలో రెన్యువల్ కోసం మొత్తం 2,793 మంది ఎదురుచూపులు చూస్తున్నారు. అందులో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ 462 మంది ఉన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ 1,940 మంది, తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ 50 మంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది 341 మంది ఉన్నారు. వీరంతా అటు రెన్యువల్ అవ్వక ఇటు ఉద్యోగాలు రాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ 2,793 మందికి ఆగస్టు నుంచి వేతనాలు అందడం లేదు. అక్టోబర్‌తో కలిపి మూడు నెలల జీతం వారికి ఇవ్వాల్సి ఉంది. తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా. ఈ పండుగకైనా వేతనమొస్తుందేమోనని సిబ్బంది వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారు. అయినా ప్రభుత్వం ఇప్పటికీ కరుణించలేదు. వేతనం లేక సొంత గ్రామాలకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పెద్ద పండుగ కావడంతో కొత్త వస్త్రాలు కొందామన్నా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. మూడు నెలలుగా జీతాల్లేక అవస్థలు పడుతున్నారు.

పండుగకు కూడా పస్తులేనా? - వినోద్ కుమార్, కళాశాల విద్య కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ కోచైర్మన్

రాష్ట్రంలో అతి పెద్ద పండుగ దసరా. మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంట్లో పిల్లలు, పెద్దలకు దుస్తులు కొందామన్నా కొనలేని పరిస్థితి ఏర్పడింది. బతుకమ్మ ఉత్సవాలు, దసరాకు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో తెలంగాణ పండుగకు ఈ పరిస్థితి ఏర్పడటం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కాంట్రాక్ట్ రెన్యువల్‌తో పాటు వేతనాలు రిలీజ్ చేయాలి. అప్పుడే మా ఇండ్లలో పండుగ మొదలవుతుంది.


Advertisement

Next Story

Most Viewed