జీహెచ్ఎంసీలో ఉల్లం ‘ఘనులు'.. అదనపు కమిషనర్ ఆర్డర్‌తో డైరెక్టర్‌గా కొనసాగింపు..

by Hamsa |
జీహెచ్ఎంసీలో ఉల్లం ‘ఘనులు.. అదనపు కమిషనర్ ఆర్డర్‌తో డైరెక్టర్‌గా కొనసాగింపు..
X

దిశ, సిటీబ్యూరో : పాలకుల పర్యవేక్షణ లోపం..ఉన్నతాధికారుల అలసత్వం కారణంగా జీహెచ్ఎంసీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన, గడువు ముగిసినా సీట్లను అతుక్కుపోయిన వారు కొందరైతే, గడువు ముగిసినా, ఇక్కడే పదవీ విరమణ పొందిన తరువాత ఎక్స్ టెన్షన్ తెచ్చుకుంటూ నచ్చిన పోస్టును అనుభవిస్తున్న అధికారులు మరికొందరు. వీరి పనితీరు, వ్యవహార శైలి, వీరు అనుభవిస్తున్న పోస్టులన్నీ సర్కారు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినవే. ఓ అధికారి దశాబ్దాల క్రితం ఆంధ్రా నుంచి జీహెచ్ఎంసీకి డిప్యూటేషన్ పై వచ్చి ఆరేళ్ల క్రితం జీహెచ్ఎంసీలోనే పదవీ విరమణ పొందారు.

రిటైర్డ్ అయిన తర్వాత కూడా బతికినంత కాలం బల్దియానే దిక్కు అన్నట్టుగా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల వద్ద పైరవీలు చేసుకుని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా పని చేసేందుకు వీలుగా ఆదేశాలు తెచ్చుకుని ఆరేళ్లు గడుస్తున్నా, ఇంకా జీహెచ్ఎంసీలోనే కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇలా వరుసగా మూడుసార్లు, ప్రతిసారి రెండేళ్ల పదవీకాలంతో ఎక్స్ టెన్షన్ తెచ్చుకుని కొనసాగుతున్నారు. కానీ ఎక్స్‌టెన్షన్ ఆర్డర్‌లో ఈ అధికారికి సర్కారు ఓఎస్‌డీగా విధులు నిర్వర్తించాలని ఆదేశాలివ్వగా, సదరు అధికారి ఏకంగా ఫైనాన్స్ విభాగానికి అడిషనల్ కమిషనర్‌గా కొనసాగుతుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి తమకిష్టమొచ్చిన పదవిని తగిలించుకుని కొనసాగుతున్న ఈ అధికారి ఇప్పటి వరకు మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గానీ, జీహెచ్ఎంసీ కమిషనర్ గానీ ప్రశ్నించిన దాఖలాల్లేవు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో ఈ అధికారికి సత్సంబంధాలు ఉండటంతో ఈ అధికారిని ప్రశ్నించేందుకు జీహెచ్ఎంసీలోని ఏ అధికారి సాహసించరంటూ కామెంట్లున్నాయి.

కీలక బాధ్యతలు అప్పగించవచ్చా?

రిటైర్డు అధికారుల సేవలను సర్కారు కొనసాగిస్తూ ఆదేశాలిచ్చినా, వారికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాల్లేవని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జీహెచ్ఎంసీకి గుండె కాయలాంటి ఫైనాన్స్ విభాగాన్ని సదరు రిటైర్డు అధికారికి అప్పగించటం పట్ల జీహెచ్ఎంసీ యూనియన్లు సైతం గతంలో తప్పుబట్టిన సంగతి తెలిసిందే. బిల్లుల చెల్లింపుల్లో రాజకీయాలు చేస్తున్నారంటూ ఈ అధికారిపై గతంలో కాంట్రాక్టర్లు ఆరోపణలు చేయడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా, ఈ అధికారిని ఇంకా కీలకమైన ఫైనాన్స్ విభాగానికి ఎందుకు అదనపు కమిషనర్‌గా కొనసాగిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీలో ఓఎస్‌డీగా విధులు నిర్వర్తించాల్సిన ఈ అధికారి ఏకంగా అదనపు కమిషనర్‌గా తన పోస్టును మార్చుకుని సర్కారు ఆదేశాలను బాహటంగా ఉల్లంఘిస్తున్నా, కనీసం కమిషనర్ ఎందుకు ప్రశ్నించటం లేదని కొందరు వాదిస్తున్నారు.

మరో అధికారి..

జీహెచ్ఎంసీలో ఓ విభాగమైన ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం)కు ఇటీవలే ప్రకాశ్‌రెడ్డి అనే అధికారి కూడా కొత్తగా వచ్చారు. ఈ అధికారికి కూడా సర్కారు ఈవీడీఎంకు అడిషనల్ కమిషనర్‌గా వ్యవహరించాలంటూ లిఖితపూర్వకమైన ఆదేశాలివ్వగా, వాటిని ఉల్లంఘించి ఆయన కూడా డైరెక్టర్ (ఈవీడీఎం)గా కొనసాగుతుండడం పట్ల కొందరు అధికారులే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలోని ఈవీడీఎంకు అదనపు కమిషనర్ హోదాలో నియమితులైన మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ సర్కారిచ్చిన హోదాను మార్చి విధులు నిర్వర్తించడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed