Munugode Bypoll: బిగ్ బ్రేకింగ్ : మునుగోడులో హస్తం టికెట్ అతడికే..!

by Nagaya |   ( Updated:2022-08-30 09:03:49.0  )
Munugode Bypoll: బిగ్ బ్రేకింగ్ : మునుగోడులో హస్తం టికెట్ అతడికే..!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: Congress will Announce Chelamalla Krishna Reddy as a Candidate of Munugode bypoll| మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. హుజూరాబాద్ ఎన్నికల తరహాలో కాకుండా సిట్టింగ్ స్థానమైన మునుగోడు అసెంబ్లీని చేజిక్కుంచుకునేందుకు గాంధీ భవన్ కేంద్రంగా సమాలోచనలు చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిని ఇప్పటికే దాదాపుగా ఖరారు చేసినప్పటికీ.. ఇప్పటికిప్పుడు వెల్లడించొద్దనే వ్యూహాన్ని టీపీసీసీ అమలు చేస్తోంది. ఇదే సమయంలో మునుగోడు కాంగ్రెస్ టికెట్‌ను ఆశించే జాబితా పెద్దగా ఉండడం వల్ల అభ్యర్థిని ప్రకటిస్తే.. అసంతృప్తులు హ్యాండ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయనే ఆలోచనకు కాంగ్రెస్ నాయకత్వం వచ్చింది. దీంతో అభ్యర్థి పేరును ఇప్పుడే వెల్లడించకుండా అందరినీ కలిసికట్టుగా పనిచేయాలనే సంకేతాలను ఇచ్చింది.

చల్లమల్లకే టికెట్ కేటాయింపు..!

మునుగోడు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తుల నుంచి భిన్న స్వరాలు వినిపించడంతో టీపీసీసీ ఆశావాహులందరనీ గాంధీ భవన్‌కు పిలిపించింది. బోసు రాజు, దామోదర్ రెడ్డి, అంజన్ కుమార్‌, పల్లె రవి, పున్న కైలాష్ నేత, పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి తదితరులతో సామాజిక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో ఇప్పట్లో అభ్యర్థి పేరును ఖరారు చేయడం లేదని, అంతా మునుగోడు నియోజకవర్గంలో కలిసి పార్టీ కోసం పనిచేయాలంటూ ఆశావాహులకు సూచించారు. కానీ వాస్తవంగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరును ఖరారు చేశారనే సంకేతాలు విన్పిస్తున్నాయి. ఇటీవల చండూరులో నిర్వహించిన బహిరంగ సభ నాటి నుంచి ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా... చల్లమల్ల కృష్ణారెడ్డి ఆర్థికంగా తోడ్పాటును అందించడంతో పాటు కార్యకర్తలతో నిత్యం టచ్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది.


సమన్వయ కమిటీల ఏర్పాటు..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులపై వేటు వేయడంతో పాటు కమిటీలను రద్దుచేశారు. అయితే ప్రస్తుతం పార్టీ కమిటీలు లేకుండా ప్రజల్లోకి వెళ్లడం కష్టతరంగా మారనుంది. దీంతో టీపీసీసీ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. పార్టీ పదవులు కాకుండా 8 మందితో సమన్వయ కమిటీ పేరుతో ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు గ్రామాలకు సమన్వయ కమిటీలను త్వరలోనే ప్రకటించి.. వారి ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు స్కెచ్ వేశారు.

మూడు రోజుల పాటు రేవంత్ పర్యటన

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపి.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు మునుగోడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రతి మండలంలో 2 వేల మంది కార్యకర్తలతో నేరుగా సమావేశం కానున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీల్లోనూ కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు రంగం సిద్ధం చేశారు. గురువారం సైతం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ బాధ్యులు, అనుబంధ సంఘాల బాధ్యులతో సమావేశం కానున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉపఎన్నికపై దూకుడు ప్రదర్శించేలా కన్పిస్తుండడం గమనార్హం.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా ఈడీ చక్రబంధం

Advertisement

Next Story