Congress MP: పదేళ్లు రేవంత్ రెడ్డే తెలంగాణ ముఖ్యమంత్రి

by Gantepaka Srikanth |
Congress MP: పదేళ్లు రేవంత్ రెడ్డే తెలంగాణ ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లోని బామర్ది టిల్లు.. బావ సొల్లు అని కేటీఆర్, హరీష్​ రావులను ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. ఈ ఇద్దరి మధ్య కొలువు కొట్లాట మొదలైందన్నారు. అధ్యక్ష పదవి నుంచి కేసీఆర్ రిటైర్డ్ అయ్యారని, ఈ సీటు కోసం బావబామ్మర్దులు తన్నుకుంటున్నారని వెల్లడించారు. ప్రభుత్వంపై ఎవరు ఎక్కువగా బురద జల్లితే వాళ్లే సీటు తీసుకోవచ్చనే భావనలో బీఆర్ఎస్ ఉన్నదన్నారు. కానీ వాళ్లకు విమర్శించేందుకు అవకాశం లేనందున, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజాపాలనను సమర్ధవంతంగా నడిపిస్తున్నారని తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలనను చూసి బీఆర్ఎస్(BRS) నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. ఫామ్ పాలన నుంచి ప్రజల పాలనకు శ్రీకారం చుట్టామని, అందుకే బీఆర్ఎస్ నేతలు జీర్జించుకోలేకపోతున్నారన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి రాజభోగాలు అనుభవించిన హరీష్ రావు(Harish Rao), కేటీఆర్(KTR) సతమతమవుతున్నారన్నారు.


పదేళ్ల పాలనకి, పది నెలల పాలనకి మధ్య చర్చ జరుగుతుందని, అందుకే బీఆర్ఎస్ నేతలకు ఏం చేయాలో? తెలియడం లేదన్నారు. తాము చేసిన తప్పిదాలన్నీ బయట పడుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ భిక్షతోనే హరీష్ రావు మంత్రి అయ్యారని గుర్తుపెట్టుకోవాలన్నారు. మాటమీద నిలబడే పార్టీ కాంగ్రెస్ అని, ఇచ్చిన మాటను నిలపెట్టుకున్నదన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాటు కలెక్షన్లు, ఎలక్షన్లు, కమీషన్లు ట్యాగ్ లైన్‌తోనే ముందుకు సాగిందన్నారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే మేనిఫెస్టోలపై చర్చించేందుకు రావాలని తాను 2023 కాంగ్రెస్ మేనిఫెస్టోతో వస్తానని, బీఆర్ఎస్ 2014,2018 మేనిఫెస్టోలతో రావాలని సవాల్ విసిరారు. స్వయంగా కేసీఆర్ నిండు అసెంబ్లీలో లక్ష ఉద్యోగాలకు పైన ఖాళీగా ఉన్నాయని ప్రకటించారని, కానీ ఎన్ని నింపారో? లెక్కలను పరిశీలిస్తే స్పష్టంగా తేలిపోయిందన్నారు.

బీఆర్ఎస్ హయంలో నిరుద్యోగులకు చేదు జ్ఞాపకాలే మిగిలాయని వెల్లడించారు. సునీల్ నాయక్ అనే నిరుద్యోగి కేసీఆర్ పేరు రాసి సూసైడ్ చేసుకున్నారని వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి బాషా రైలుకు ఎదురెళ్లి మాంసం ముద్దై మిగిలాడన్నారు. ఇవన్నీ బీఆర్ఎస్‌లో జరిగిన దారుణాలను వివరించారు. మరోవైపు మోడీ కూడా విచిత్రంగా వ్యవహరిస్తున్నారని చురకలు అంటించారు. కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయడం లేదని ట్వీట్ చేశారని, కానీ తెలంగాణలో ఏమేమీ చేశామో? తమ సీఎం ట్వీట్ ద్వారానే సమాధానం ఇచ్చారని, దీంతో మోడీ తన ట్వీట్ ను తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజల్లో మంచి మార్కులు పడుతున్నాయని అన్నారు. పదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed