తెలంగాణ ప్రతిపక్ష నాయకుడి జాడ ఎక్కడా?

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-03 14:47:08.0  )
తెలంగాణ ప్రతిపక్ష నాయకుడి జాడ ఎక్కడా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నాయకులంతా క్షేత్రస్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్ గౌడ్ వెల్లడించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల మొదలు కొని మండల అధ్యక్షుల వరకు ప్రజలను కాపాడేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారని అభినందించారు. వందల కిలో మీటర్లు రోడ్డు మార్గం గుండా ప్రయాణించి సీఎం ప్రజల కు భరోసా కల్పిస్తున్నారన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారని విమర్శించారు. అమెరికా నుంచి కేటీఆర్ విమర్శలు చేయడం తగదన్నారు. తమ పార్టీ సంపూర్ణంగా ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వర్షాలతో అతలాకుతలమైతే, ప్రతిపక్ష నాయకుడు జాడ ఎక్కడా? అంటూ ప్రశ్నించారు. ప్రజలకు భరోసా ఇస్తూ, సర్కార్కు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే పరిమితం కావడం దారుణమన్నారు. రాజకీయాలను పక్కకు పెట్టి సాయం చేయాలని సూచించారు. కవిత బెయిల్ కోసం వందల మంది ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు, వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు ఎందుకు ఆసక్తి చూపడం లేదని మండిపడ్డారు.

ప్రధాన మంత్రి ఫసల్ భీమా కట్టకుండా రైతులను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. ఏపీ లో ప్రతిపక్ష నేత గా జగన్మోహాన్ రెడ్డి సమర్దవంతమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. బాధ్యతల ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు. ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమై, తనకు ఏమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నాడని ఫైర్ అయ్యారు. పదేళ్లు సంపాదించుకున్న సొమ్మును బీఆర్ఎస్ నేతలు పంచిపెట్టాలని కోరారు. ఇక హైడ్రా విషయంలో అందరూ సపోర్టు చేయాల్సిందేనని మహేష్​ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. సిటీ ఆఫ్ లేక్స్ అంటేనే హైదరాబాద్ అని, పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా మద్ధతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed