బీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే...? మంత్రి ఎర్రబెల్లితో భేటీ!

by Nagaya |   ( Updated:2022-12-27 15:29:29.0  )
బీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే...? మంత్రి ఎర్రబెల్లితో భేటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రోజు రోజుకు రాజకీయ వేడి పెరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెడుతున్నారు. ఇందుకోసం ఇతర నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు అన్ని పార్టీలు గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తాజాగా బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం హనుమకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్యే పొదెం వీరయ్య భేటీ అయి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే సదరు ఎమ్మెల్యే పార్టీ మారబోతున్నారని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. బీఆర్ఎస్‌లో చేరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలంకు బదులుగా ములుగు నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

ములుగు విషయంలో గులాబీ బాస్ సీరియస్‌గా ఉన్నారని అందులో భాగంగా సీతక్కకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ నుంచి వీరయ్యకు ఆఫర్ వచ్చిందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో గుప్పుమంటోంది. ఈ నేపథ్యంలో మంత్రితో వీరయ్య భేటీ కావడంతో మార్టీ మార్పుపై మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తన విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని పొదెం వీరయ్య ఇదివరకే ఖండించారు. పార్టీ మార్పు విషయంలో నిజం లేదని తాను వచ్చే ఎన్నికల్లో భద్రాచలం నుంచే పోటీ చేస్తానని చెప్పారు. కాగా మంత్రితో భేటీపై స్పందించిన ఆయన భద్రాచలంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ గురించి మాత్రమే తాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో చర్చించినట్టుగా చెప్పారు. అయితే పార్టీ మార్పుపై వీరయ్య ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా ప్రచారం మాత్రం ఆగడం లేదు.

Advertisement

Next Story

Most Viewed