కవిత బెయిల్ కు కాంగ్రెస్ నేత విశ్వప్రయత్నాలు : బండి సంజయ్

by M.Rajitha |
కవిత బెయిల్ కు కాంగ్రెస్ నేత విశ్వప్రయత్నాలు : బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మధ్య జరిగిన క్విడ్ ప్రోకో ఒప్పందంలో భాగంగా కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, మియాపూర్ భూములు, నయీం డైరీ కేసులను పూర్తిగా నీరుగార్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా తప్పించారన్నారు. లిక్కర్ కేసులో అడ్డంగా దొరికి జైలు పాలైన కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ ఇప్పించేందుకు స్వయంగా కాంగ్రెస్ నేత కోర్టుల్లో విశ్వప్రయత్నం చేస్తూ వాదనలు వినిపించారని ఆయన పేర్కొన్నారు. అందుకు ప్రతిఫలంగా బీఆర్ఎస్.. రాజ్యసభ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభ్యర్ధిని నిలబెట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపించిన నాయకుడినే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధిగా నిలబెట్టడంతో ఆయన గెలుపును ఏకగ్రీవం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టలేదనేది జగమెరిగిన సత్యమని బండి పేర్కొన్నారు.

ఇటీవల దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీతో సమావేశమై తెలంగాణలో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని, అదానీతో బీజేపీ కుమ్కక్కైందని చెబుతున్న కాంగ్రెస్ నేతలు దీనికేం సమాధానం చెబుతారని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు చేస్తే సంసారం.. ఇతర పార్టీల నేతలు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు గాయిగాయి చేయడం సిగ్గు చేటని ఆయన గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలను, ఇద్దరి మధ్య కొనసాగుతున్న చీకటి ఒప్పందాలను బీజేపీ ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తుండటంతో ఓర్వలేని ఈ పార్టీలు ప్రజలకు ప్రయోజనం లేని అంశాలపై లొల్లి చేస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నాయని ఫైరయ్యరు. బీజేపీని బదనాం చేసేందుకు అదానీ, సెబీ అంశాలను సీఎం రేవంత్ రెడ్డిసహా కాంగ్రెస్ నేతలు తెరపైకి తీసుకొచ్చి మీడియాను సైతం పక్కదారి పట్టిస్తుండటం విస్మయం కలిగిస్తోందన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి తీవ్రమైన అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలపై అనేక కేసుల రూపంలో కత్తి వేలాడుతుండటంతో అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీతో బీఆర్ఎస్ కుమ్కక్కైందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదని తేలిపోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో కలిసి ప్రజల చర్చను పక్కదారి పట్టిస్తోందని బండి విమర్శలు చేశారు.

Next Story

Most Viewed