మోడీ డైరెక్షన్‌లో బీఆర్ఎస్.. కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర వదిలేసిండు: అద్దంకి హాట్ కామెంట్స్

by Ramesh N |
మోడీ డైరెక్షన్‌లో బీఆర్ఎస్.. కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర వదిలేసిండు: అద్దంకి హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ డైరెక్షన్‌లో నడిచే స్థాయికి బీఆర్ఎస్ దిగజారిపోయిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ (Addanki Dayakar) హాట్ కామెంట్స్ చేశారు. ఆల్ పార్టీల ఎంపీల మీటింగ్‌కు హాజరు కాకపోవడంపై బీజేపీ, బీఆర్ఎస్‌పై ఫైర్ అవుతూ శనివారం ఒక వీడియో విడుదల చేశారు. అఖిలపక్ష ఎంపీల మీటింగ్‌కి రాకుండా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం మీద ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చే బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహారం చూడండని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై అఖిలపక్షం పెట్టాలని బీజేపీ, బీఆర్ఎస్‌లు అన్నాయని, ఈ రోజు ఎంపీల మీటింగు కూడా అఖిలపక్షం లాంటిదేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం కోసం ఎట్లా వ్యవహరించాలని సొల్యూషన్ కోసం ఎంపీల మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీజేపీ, బీఆర్ఎస్ హాజరు కాలేదన్నారు.

ప్రజా సమస్యలు, ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర వదిలేసి ఔట్ సోర్సింగ్‌లో అల్లునికి, కొడుకుకి ఇచ్చిండని సెటైర్లు వేశారు. రెండు పార్టీల డ్రామాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సమావేశాన్ని ఎందుకు బైకాట్ చేశారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు తప్ప ప్రజా సమస్యలు పట్టవని ఆరోపించారు.

తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా చర్చకు రావడంతో బీఆర్ఎస్, బీజేపీకి మింగుడు పడటం లేదన్నారు. బీజేపీ వేసే డ్రామాను బీఆర్ఎస్ వేస్తుందన్నారు. రెండు పార్టీల నాయకులు జలసీతో రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలోని రావాల్సిన బిల్లుల కోసం కాంట్రాక్టర్లతో ధర్నాలు చేయిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పాజిటివ్‌గా పోవాలని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

Next Story

Most Viewed