- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం: మాజీ మంత్రి కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నెటిజన్లతో దీపావళి రోజు గంటన్నరపాటు ‘ఎక్స్’ వేదికగా #askKTR నిర్వహించారు. అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. దేశంలోని అనేక పార్టీల నేతలు, ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు పాదయాత్రలు చేస్తున్నారు.. మీరెప్పుడు చేస్తారని నెటిజన్లు అడగడంతో దీనికి స్పందించిన కేటీఆర్ ఖచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశాలు ఏమాత్రం లేవు అని, అందుకే అబద్ధాల మీద, అసత్యాల మీద సమయం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గత పది నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క మంచి పని కూడా గుర్తుకు రావడం లేదన్నారు. అబద్ధపు హామీలపై ఎన్నికైన కాంగ్రెస్ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేమన్నారు.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించిందని, వీటికి భయపడేది లేదన్నారు. దొడ్డువడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీ బోగస్ గా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక రైతు బంధు లేక నష్టపోతున్న రైతన్నల తరఫున పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రం ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడం ఖాయమన్నారు. అయితే కొత్త ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నష్టం నుంచి తెరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాల్ గా మారుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనం అయిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ వెనక్కి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయ వనరులు నుంచి మొదలుకొని వ్యవసాయ రంగం, అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు.
నిరుద్యోగం పెరిగిందన్నారు. రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వదిలి వెళ్ళిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడంపై ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో పాటు తీసుకున్న నిర్ణయాలలో పారదర్శకత పైన ప్రజల తరఫున కొట్లాడుతామన్నారు. కాంగ్రెస్ పై అప్పుడే బలమైన ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా మార్చే అవకాశం ఉన్నదా? అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరో నాలుగేళ్లు వేచి ఉండాల్సిందే అన్నారు. ప్రజలు ఐదేళ్ల కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారని, దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి అదేళ్లు పూర్తికాలిక పదవిలో ఉంటారా? లేదా? ఓటుకు నోటుతో బీజేపీకి వెళ్తాడా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజకీయాల్లో ఏదైనా జరుగుతుందని, కాంగ్రెస్ చరిత్ర చూస్తే ఎప్పుడూ ఎలాంటి పరిణామైనా జరగవచ్చు అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడు ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదన్నారు. దాదాపు రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురయ్యానన్నారు. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్ధంకాదని, ఈ విషయం తనకు అత్యంత బాధ కలిగిస్తుందన్నారు. నీచమైన రాజకీయాల కోసం తన కుటుంబాన్ని లాగుతున్న ముఖ్యమంత్రి పైన, ఆయన వందిమాగదుల పైన ప్రజల మద్దతుతో పోరాటం చేస్తానన్నారు.
రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయ సంస్కృతి అత్యంత హీనమైన దశలో రాష్ట్రం ఉన్నదన్నారు. అయితే ఈ నీచమైన దశ కూడా త్వరలో ముగిసిపోతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. చెరువుల సంరక్షణ పేరుతో ప్రభుత్వం పేపర్ మీద గొప్పలు చెబుతున్నప్పటికీ అసలైన ఎజెండా అవినీతి మాత్రమే అన్నారు. మూసి బ్యూటిఫికేషన్ కి తాము వ్యతిరేకం కాదు కానీ మూసి లూటిఫీకేషన్ కి వ్యతిరేకం అన్నారు. మూసీ ప్రక్షాళన దేశంలోనే అతిపెద్ద అవినీతి స్కాం అవుతుందన్నారు. హైడ్రా కేవలం కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుందన్నారు. ఇప్పటిదాకా ఒక్క పెద్ద బిల్డర్ ని కూడా హైడ్రా టచ్ చేయలేదని, కేవలం పేద,మధ్యతరగతి ప్రజలను మాత్రమే నిర్దాక్షిణ్యంగా దోచుకున్నదన్నారు. పార్టీ తరఫున ఏం ఆశించకుండానే పార్టీకీ సోషల్ మీడియా వారియర్స్ అద్భుతంగా పనిచేస్తున్నారని అన్నారు. త్వరలోనే ఒక విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు మద్దతుగా వ్యవహరిస్తున్న ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయం సోషల్ మీడియా మాత్రమే అన్నారు.
తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ పదం ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు నిలిచే ఉంటుందన్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన పార్టీని, తమ నాయకులందరికీ ఎప్పటికప్పుడు ఆయా అంశాల పైన మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కొత్తగా ఎన్నికైన ఈ ప్రభుత్వానికి ఇచ్చిన 420 హామీలు అమలు చేసేందుకు సరిపడా సమయం ఇచ్చారన్నారు. నూతన సంవత్సరం తర్వాత మరిన్ని కార్యక్రమాలను చూస్తామన్నారు. తమ విధులు మరిచి, చట్ట విరుద్ధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపైన రెచ్చిపోతున్న పోలీస్ అధికారులను గుర్తుపెట్టుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వాధినేతలను ప్రసన్నం చేసుకునే పనుల్లో కొంతమంది పోలీసు అధికారులు బిజీగా ఉండడంతో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయని అన్నారు. హైదరాబాద్ లో నెల రోజులపాటు 144 సెక్షన్ విధించడం షాక్ కు గురి చేసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయన్నారు.
ఇచ్చిన హామీలను తప్పుతున్న కాంగ్రెస్ లాంటి పార్టీల పైన చర్యలు తీసుకునేందుకు ప్రజలను పదేపదే మోసం చేయడానికి అరికట్టేందుకు బలమైన ఎన్నికల సంస్కరణలు అవసరమన్నారు. మహారాష్ట్ర ల్లోనూ జాతీయ పార్టీలను ప్రజలు నమ్మవద్దని, స్థానిక పార్టీలకు ఓటు వేయాలన్నారు. తమిళనాడు విజయ్ దళపతి ప్రారంభించిన రాజకీయ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ పరమైన అంశాలపై విభేదాలే తప్ప టీడీపీ, వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకులందరితో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండే అవకాశం వలన మాకు నిబద్ధత కలిగిన, బలమైన నూతన నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశం ఇచ్చిందన్నారు. నిజం కన్నా పర్సెప్షన్, పీపుల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని గత ఎన్నికల ఓటమి మాకు నేర్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీలు ప్రజల్లో అవాస్తవికమైన ఆశల్ని రేకెత్తించాయని, రెండుసార్లు వరుసగా గెలవడంతో యాంటీ ఇన్ కంబెన్సీ కూడా తమ ఓటమి విషయంలో కొంత ప్రభావం చూపిందన్నారు. పార్టీ మారిన 10 మంది అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై బీజేపీ చేస్తున్న మరొక జుమ్లా అయి ఉంటుందన్నారు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపైన ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు.