స్థానిక ఎన్నికలకు గెట్ రెడీ.. శనివారం నుంచే..

by karthikeya |
స్థానిక ఎన్నికలకు గెట్ రెడీ.. శనివారం నుంచే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓ వైపు కులగణన కోసం బీసీ కమిషన్, ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ సైతం సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. కొత్తగా పీసీసీ చీఫ్‌గా నియమితులైన మహేశ్‌ కుమార్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌తో పాటు ఏఐసీసీ నుంచి వచ్చిన బాధ్యులు విశ్వనాథ్, విష్ణునాథ్‌లు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. గాంధీభవన్ వేదికగా శనివారం నుంచి అన్ని జిల్లాల పార్టీ నేతలతో రివ్యూ మీటింగులకు షెడ్యూలు ఖరారైంది. తొలి రోజున వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో సమీక్ష జరగనున్నది. మొత్తం వారం రోజుల్లో జిల్లా స్థాయి సమావేశాలను కంప్లీట్ చేసిన తర్వాత మండలస్థాయిలో సైతం నిర్వహించి కొత్త కమిటీలను పీసీసీ ఏర్పాటు చేయనున్నది. ఇప్పుడున్న కమిటీలన్నింటినీ రద్దు చేయడంతో కొత్త కమిటీల్లో సమర్థులైనవారిని నియమించాలని భావిస్తున్నది. ఈ కమిటీల కూర్పులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కూడా భాగస్వాములను చేయాలనుకుంటున్నందున ఈ సమావేశాలకు వారు కూడా హాజరుకానున్నారు.

పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు

లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు ప్రభుత్వం తరఫున సన్నాహాలు ప్రారంభమైనందున పార్టీ కూడా ఇప్పటి నుంచే సరైన అభ్యర్థులను నిలబెట్టడానికి కసరత్తు మొదలుపెట్టింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుమీద జరుగుతున్నప్పటికీ సర్పంచ్, వార్డు సభ్యుల గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతాయి. దీంతో పార్టీ నైతిక మద్దతుతో గెలిచే అవకాశమున్న స్థానిక లీడర్లను ఎంపిక చేయడంపై పీసీసీ దృష్టి సారించింది. ప్రతిపక్షాలకు విజయావకాశాలు లేకుండా కాంగ్రెస్ ఒకింత అడ్వాన్సులో ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆలోచిస్తున్నది. గతంలో పోటీ చేసి ఓడిపోయినవారితో పాటు వివిధ కార్పొరేషన్లలో బాధ్యతలు నిర్వహించినవారు, స్థానికంగా ప్రజల్లో గుర్తింపు ఉన్న లీడర్లను ఎంపిక చేయాలనుకుంటున్నది. పార్టీలో యాక్టివ్‌గా పాల్గొనడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది పీసీసీ ఆలోచన. ఇంతకాలం పీసీసీ చీఫ్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి కార్యకర్తలు, స్థానిక లీడర్లు పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చినందున వారి సేవలను గుర్తించేలా పదవులు కట్టబెట్టనున్నట్టు ఓపెన్‌గానే ప్రకటించారు.

పరిగణనలోకి అన్ని స్థాయిల నేతల విశ్వాసాలు

ఆ అభిప్రాయానికి తగినట్టుగానే కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌ గౌడ్ సైతం పార్టీ కార్యకర్తలకు, లోకల్‌గా ఉండే లీడర్లకు నిత్యం గాంధీభవన్‌లో అందుబాటులో ఉంటానని క్లారిటీ ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణమంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన పీసీసీ చీఫ్ మహేశ్.. ఈ ఏడాది చివరి నాటికి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గరిష్ట స్థాయిలో జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గెలిచేలా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు ఆయా గ్రామాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదో, ఇకపైన ఏ తీరులో బలోపేతం చేయాలో, ఈ పనికి సమర్థులైన లోకల్ లీడర్లు ఎవరో గుర్తించేందుకు వీలుగా, అన్ని స్థాయిల్లోని నేతల విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు గాంధీభవన్ వేదికగా రివ్యూ మీటింగులకు శ్రీకారం చుట్టారు. గతంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయినవారిని సైతం ఈ సమావేశాలకు ఆయన ఆహ్వానించారు. వీలైనంత వరకు ఏకాభిప్రాయంతోనే అటు పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పజెప్పడానికి, ఇటు స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇవ్వడానికి పీసీసీ చీఫ్ ఆలోచిస్తున్నారు.

సంక్షేమ ఫలాలు జనంలోకి తీసుకెళ్లేలా ప్రణాళిక

పీసీసీ చీఫ్‌గా మహేశ్‌ కుమార్ గౌడ్ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు జరగడానికి భిన్నంగా ఈ రివ్యూ మీటింగుల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీతో పాటు ఏఐసీసీ నుంచి బాధ్యులుగా వచ్చిన విశ్వనాథ్, విష్ణునాథ్‌లను కూడా భాగస్వాములయ్యేలా పీసీసీ షెడ్యూలు రూపొందించింది. ‘స్థానిక’ ఎన్నికలకు పార్టీ సంస్థాగతంగా చేస్తున్న ఏర్పాట్లు ఇలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలైన సంక్షేమ పథకాలు, గ్రామ స్థాయిలో ప్రజలకు చేసిన ఫలాలు, వాటి ద్వారా లబ్ధిపొందిన అంశాలను ఇప్పటి నుంచే జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందుతున్నది. పార్టీ, ప్రభుత్వం జోడు గుర్రాల్లా ఉండేలా, శ్రేణులకు స్పష్టమైన మెసేజ్ ఇచ్చేలా ఇప్పటికే ప్రతి వారం ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌కు రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేశారు. కేబినెట్ సమావేశం కారణంగా శుక్రవారం మంత్రి విజిట్ వాయిదా పడింది. మంత్రులు గాంధీభవన్‌కు రావడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలుపై గణాంకాలతో సహా వెల్లడించే అవకాశమున్నందున పార్టీ శ్రేణులు ఆ అంశాలను జనంలోకి తీసుకెళ్లడానికి, ఫలితంగా పార్టీ స్ట్రాంగ్ కావడానికి దోహదపడుతుందన్నది పీసీసీ చీఫ్ భావన.

రివ్యూ పూర్తయ్యాక నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్

వారం రోజుల పాటు అన్ని జిల్లాల్లోని పార్టీ లీడర్లతో రివ్యూ మీటింగులు పూర్తయిన తర్వాత నిర్దిష్టమైన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్‌ను పీసీసీ రూపొందించనున్నది. ఏక కాలంలో పలు టాస్కులతో పార్టీ కార్యకర్తలు, లీడర్లకు ప్రోగ్రామ్ అప్పజెప్పనున్నది. పార్టీని బలోపేతం చేయడం, మండల స్థాయి నుంచి కొత్త కమిటీలను నియమించడం, ‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకోవడం, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జన బాహుళ్యంలోకి తీసుకెళ్లడం, వివిధ స్థాయిల్లోని పార్టీ నేతల మధ్య పటిష్ట సమన్వయం నెలకొల్పడం.. ఇవీ కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ నిర్దేశించుకున్న యాక్టివిటీ అని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ కార్యకర్తలతో పాటు అనుబంధ సంఘాల బాధ్యతలు, యాక్టివిస్టులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్తులను చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed