‘వివాదాల’ నేతలపై టీపీసీసీ సీరియస్

by Prasanna |   ( Updated:2024-10-22 02:37:28.0  )
‘వివాదాల’ నేతలపై టీపీసీసీ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీలోని కీలక నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేయడంపై టీపీసీసీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారం రేపగా, తాజాగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జీవో 29 పై చేసిన కామెంట్లు పార్టీకి డ్యామేజ్ చేసేలా ఉన్నాయని పీసీసీ భావిస్తున్నది. వీటిని కట్టడి చేయకపోతే, భవిష్యత్తులో పార్టీకి నష్టమని పేర్కొంటున్నది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో జీవో 29 పై రిజర్వుడ్ అభ్యర్థులకు ఎలాంటి నష్టం లేదని మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా తన ప్రెస్ మీట్ ద్వారా పేర్కొన్నారు. కానీ దీని వలన వంద శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం దీన్ని పరిష్కరించకుండా గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించడం సరికాదని సంపూర్ణ అంకెలతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివరించారు. దీంతో ఒకే పార్టీలో రెండు వేర్వేరు స్టాండ్ లు కనిపిస్తున్నాయని, ఇటు గ్రూప్-1 అభ్యర్థులతోపాటు ప్రతిపక్షాలు కూడా సోషల్ మీడియాల్లో విమర్శలు మొదలుపెట్టాయి. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆలోచిస్తున్నారు. దీనిలో భాగంగానే త్వరలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఇంటర్నల్ మీటింగ్ ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. సీఎం అనుమతి తర్వాత ఈ కార్యక్రమానికి షెడ్యూల్ ప్రకటించనున్నారు.

మార్పు కోసం..

కాంగ్రెస్ స్టేట్ చీఫ్ గా మహేష్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత, పార్టీలో కొన్ని మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు గాంధీభవన్ లో మంత్రుల ముఖాముఖి ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తీసుకు రాగా, దీని ద్వారా పార్టీ ముఖ్యులు, క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేసే నేతలు తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. అయితే పార్టీ డ్యామేజ్ అయ్యేలా ఉన్నదని భావిస్తే, ఏ స్థాయి లీడర్లకైనా.. పీసీసీ చీఫ్ సమస్యను సంపూర్ణంగా వివరిస్తున్నారు. మంత్రులు కాంట్రవర్సీ కామెంట్లు చేయడం ద్వారా హెల్తీ పాలిటిక్స్ చేయడం కష్టమని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీ పవర్ లో ఉన్నదని, ఇష్టారీతిన మాట్లాడడం సరికాదని నొక్కి చెప్తున్నారు. ఈ అంశాలన్నీ ప్రజాప్రతినిధులకు మరోసారి గుర్తు చేసేందుకు త్వరలోనే మీటింగ్ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు.

సీరియస్ యాక్షన్!

పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మొదటి నుంచీ చెప్తూనే ఉన్నారు. పార్టీ ఆదేశాలను ఏ స్థాయి లీడర్లయినా పాటించాల్సిందేనంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. కానీ కొందరు నేతలు ప్రజలను కన్ ఫ్యూజ్ చేసేలా, పార్టీ కి వ్యతిరేకత వచ్చేలా మాట్లాడటంపై మహేశ్ కుమార్ గౌడ్ గుర్రుగా ఉన్నారు. ఈ సమస్యను సీరియస్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతం కాంగ్రెస్ లోని క్రమ శిక్షణ కమిటీలను విస్తరించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మండల స్థాయి నుంచి స్టేట్ కేడర్ వరకు నేతలు మాట్లాడే అంశాలను ఈ కమిటీలు ఎప్పటికప్పుడు ఫోకస్ పెడతాయి. పార్టీ కి డ్యామేజ్ అయ్యేలా వ్యాఖ్యలు, ఇతర కార్యకలాపాలు కొనసాగితే పీసీసీ కి ప్రత్యేక రిపోర్టు ఇవ్వనున్నారు. దాని ఆధారంగా ఆయా నేతలపై డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకునే చాన్స్ ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story