అక్కడ పీకే.. ఇక్కడ సునీల్.. టీ కాంగ్రెస్‌లో కన్‌ఫ్యూజన్ పాలిటిక్స్

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-20 01:15:57.0  )
అక్కడ పీకే.. ఇక్కడ సునీల్.. టీ కాంగ్రెస్‌లో కన్‌ఫ్యూజన్ పాలిటిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ స్థాయిలో ప్రశాంత్​ కిషోర్​ వ్యవహారంపై రాష్ట్రంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్​, టీఆర్​ఎస్​లో ఉత్కంఠ చర్చ సాగుతోంది. అధికార టీఆర్​ఎస్​లో ఎలా ఉన్నా.. కాంగ్రెస్​లో మాత్రం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు మొదలయ్యాయి. దీంతో ఆ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం వ్యూహకర్తల అంశం తెలియని ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీలో ప్రశాంత్​ కిషోర్​ మరోసారి సోనియాతో భేటీ అయ్యారు. మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై.. దాదాపు 3 గంటలు చర్చించారు. ఇదే సమయంలో మరో వ్యూహకర్త సునీల్​ కనుగోలు రాష్ట్రంలోని పరిస్థితులను అంచనా వేస్తున్నారు. సునీల్​ టీం ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వివరాలు సేకరిస్తోంది.

ఇటు నుంచి అటు

మొన్నటిదాకా టీఆర్​ఎస్​ వ్యూహకర్తగా నియమించుకున్నట్లు ముద్రపడిన ప్రశాంత్​ కిషోర్​ ఒక్కసారిగా సోనియా శిబిరంలో కనిపించారు. గతంలో వ్యూహకర్తల అంశాన్ని ఈజీగా కొట్టిపారేసే సీఎం కేసీఆర్​.. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మాత్రం పీకేను ఆకాశానికెత్తారు. ఆయన టీఆర్​ఎస్​కు పని చేస్తే తప్పేంటని అన్నట్లుగా మాట్లాడారు. యాంటీ బీజేపీ టీంకు పీకే వ్యూహకర్తగా వ్యవహరిస్తాడనే సంకేతాలిచ్చారు. దీంతో కేంద్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం టీఆర్​ఎస్​ తో ప్రశాంత్​ కిషోర్​కు ఒప్పందం కుదిరిందని టీఆర్​ఎస్​ వర్గాలు కూడా చెప్పుకొచ్చాయి. ఒకదశలో మూడోసారి కూడా మాదే గెలుపు అనే ధీమా కూడా మొదలైంది.

మరోవైపు ఇటీవల రాష్ట్ర నేతలతో ఢిల్లీలో సమావేశమైన ఏఐసీసీ అగ్రనేత రాహుల్​ గాంధీ.. సునీల్​ కనుగోలును పరిచయం చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో అప్పటికే ఆయన చేసిన సర్వే నివేదికలను పార్టీ ముందుంచారు. కాంగ్రెస్​ బలపడుతుందని, పార్టీ నేతలు సమన్వయంతో ఉండాలని, అంతర్గత కుమ్ములాటలు వీడితో కలిసి వస్తుందంటూ సునీల్​ రిపోర్ట్​లో సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. తెలంగాణతో పాటుగా కర్ణాటకకు కూడా ఎస్​కే వ్యూహకర్తగా వ్యవహరించనున్నట్లు ఏకంగా రాహుల్​ గాంధీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్​లో కూడా కొంత ఊపు వచ్చింది.

వాస్తవానికి ప్రశాంత్​ కిషోర్​, సునీల్​ కనుగోలు ఇద్దరూ గురుశిష్యులే. పీకే నేతృత్వంలో సునీల్​ పని చేశారు. సోషల్​ మీడియా వింగ్​ను తానే నిర్వహించారు. ఆ తర్వాత వీడిపోయి సునీల్​ సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకుని, పలు పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా గతంలోనూ టీఆర్​ఎస్​కు కూడా సునీల్​ పని చేసినట్లు తెలిసిందే.

అక్కడ గురువు.. ఇక్కడ శిష్యుడు

రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీకి ప్రశాంత్​ కిషోర్​ వ్యూహకర్తగా ఉంటే.. ఆయన దగ్గర పని చేసిన శిష్యుడు సునీల్​ కనుగోలు కాంగ్రెస్​ పక్షాన ఒప్పందం కుదిరించుకున్నారు. దీంతో రెండు పార్టీలు కూడా వ్యూహకర్తలపై ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో పీకే ఒక్కసారిగా కాంగ్రెస్​ శిబిరంలో కనిపించడంతో దేశస్థాయిలో ఎలా ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం చర్చకు దారి తీసింది. అల్రెడీ టీఆర్​ఎస్​కు పని చేస్తున్నట్లుగా గులాబీ బాస్​ ప్రకటించిన పది రోజులకే పీకే కాంగ్రెస్​తో మంతనాలు మొదలుపెట్టడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్రంలో మూడో ఫ్రంట్​ తరహాలో ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టేందుకు కేసీఆర్​ రాష్ట్రాల పర్యటన చేస్తున్నారు. ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో సమాధానం రాలేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతేకాకుండా దేశంలో కాంగ్రెస్​ లేని కూటమి సాధ్యం కాదంటూ ఆయా పార్టీల అధినేతలు ప్రకటించారు. ఇలాంటి సమయంలోనే ప్రశాంత్​ కిషోర్​ కాంగ్రెస్​ అధినేత్రి నివాసంలో చర్చలు జరుపడం ప్రాధాన్యతగా మారింది.

ఇక, ఇప్పటికే కాంగ్రెస్​ పక్షాన రెండు రాష్ట్రాలకు వ్యూహకర్తగా ఒప్పందం చేసుకున్న సునీల్​ కనుగోలు రాష్ట్రంలో పరిశీలన మొదలుపెట్టారు. సునీల్​ టీం వారం ముందు నుంచే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తోంది. స్థానిక పరిస్థితులపై నివేదికను సిద్ధం చేస్తోంది. వచ్చేనెల 6న రాష్ట్రానికి రాహుల్​ గాంధీ రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనపై గ్రౌండ్​ రిపోర్ట్​ సిద్ధం చేస్తోంది. రాహుల్​ గాంధీ పర్యటన సందర్భంగా ఎలాంటి అంశాలను ఫోకస్​ చేయాలి, ఏ వర్గాన్ని టార్గెట్​ చేయాలనే అంశాలపై వివరాలు సేకరిస్తోంది. రైతులు, యూత్​, మహిళల సమస్యలు, నిరుద్యోగత మీద చాలా మేరకు రిపోర్ట్​ సిద్ధం చేసింది. రైతు సంఘర్షణ సభ పేరిట కాంగ్రెస్​ పార్టీ వరంగల్​లో ఈ సభను నిర్వహిస్తున్నా.. ప్రధాన టార్గెట్​ మాత్రం రైతులు, నిరుద్యోగ యువత, మహిళలపైనే ఫోకస్​ చేస్తున్నారు. ఇదే అంశాన్ని సునీల్​ టీం కూడా ఏఐసీసీకి చేరవేసింది. ప్రాథమికంగా ఒక నివేదికను సైతం పంపించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే రాహుల్​ గాంధీ ఏ అంశాలను మాట్లాడాలనే దానిపై స్క్రిప్ట్​ రెడీ చేయనున్నారు.

Advertisement

Next Story