BRS కేడర్‌లో గందరగోళం.. కార్యకర్తలను అయోమయంలో పడేస్తోన్న KCR, కేటీఆర్ కామెంట్స్..!

by Satheesh |
BRS కేడర్‌లో గందరగోళం.. కార్యకర్తలను అయోమయంలో పడేస్తోన్న KCR, కేటీఆర్ కామెంట్స్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి తోచినవిధంగా వారు మాట్లాడుతున్నారు. 12 సీట్లు గెలిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని ఒకరంటే.. ఏడాదిలోగా రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని మరొకరు.. ఇంకొకరు బీజేపీ గెలుస్తుందనే వ్యాఖ్యలు.. ఇలా వారి మాటలతో పార్టీ కేడర్‌ను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతోంది.. ఎవరికి ఓటువేయాలి అనేది కూడా చర్చనీయాంశమైంది. ఎన్నికల టైంలో ఇలాంటి వ్యాఖ్యలు హాట్ టాఫిక్‌గా మారాయి.

లోక్ సభ ఎన్నికల్లో ఎన్నిసీట్లు గెలుస్తాం.. అసలు పార్టీని కాపాడుకుంటామా అనేదానిపై ఇప్పటికే కేడర్‌లో చర్చ జరుగుతోంది. మరోవైపు అధిష్టానం సైతం ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అందుకు సంబంధించి ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసింది. అయితే పార్టీలో ఎవరు ఏం మాట్లాడుతారో అర్థం కాకుండా పోయిందని నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఖమ్మం రోడ్డుషో సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలువబోతున్నామని, నామాను గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అవుతారని, అప్పుడు రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు మేలు జరుగుతుందని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అంటే బీజేపీతో కలుస్తామని చెప్పకనే చెప్పారా? అనేది అర్ధంకాక సతమతమవుతున్నారు.

మరోవైపు కేటీఆర్ సైతం కేడర్‌ను డైలమాలో పడేస్తున్నారు. వేదిక ఏదైనా 10 నుంచి 12 సీట్లు గెలిస్తే ఏడాదిలోగా రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని పేర్కొంటున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసలు తమకు పోటీ కాదని, బీజేపీ బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని పేర్కొంటున్నారు. దీంతో ప్రజల్లో బీఆర్ఎస్ స్థానిక నేతలపై కొపం తగ్గలేదని, ఇలాంటి తరుణంలో అన్ని సీట్లు గెలుస్తాం.. ఇన్ని సీట్లు గెలుస్తామని కాలయాపన చేస్తున్నారే తప్ప పార్టీపై దృష్టిసారించడం లేదని పలువురు నేతలు మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటే మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల ఓ ఫంక్షన్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డికి మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎదురుపడటంతో ఆయనతో మల్లారెడ్డి సెల్ఫీ దిగారు. ‘‘అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్’’ అంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎన్నికలు జరుగకుండానే బీఆర్ఎస్ చేతులు ఎత్తేసిందా..? అనేది కేడర్‌లో చర్చనీయాంశమైంది. దీనిపై మల్లారెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని పార్టీ నేతలే బహిరంగంగా పేర్కొంటున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కేడర్ కృషి చేస్తోంది. ఈ సమయంలో పార్టీ అధిష్టానంతో పాటు నేతలు సైతం ఎవరికి వారు తోచిన విధంగా వ్యాఖ్యలు చేస్తుండటంతో కేడర్‌లో అయోమయం నెలకొంది. ఎన్నికల్లో మేనిఫెస్టో లేకుండా ప్రచారం కొనసాగిస్తుండటం కూడా చర్చకు దారితీసింది. అధిష్టానం నేతలకు సరైన గైడ్ లైన్స్ ఇవ్వకపోవడమా? లేకుంటే అసెంబ్లీ ఓటమితో కమాండింగ్ కోల్పోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందా? అనేది రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఇది ఏమేరకు పార్టీపై ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన నెలకొందని పార్టీ సీనియర్ నేత తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed