ప్రభుత్వం నిర్లక్ష్యంతో ర్యాగింగ్ భూతానికి విద్యార్థులు బలి

by sudharani |
ప్రభుత్వం నిర్లక్ష్యంతో ర్యాగింగ్ భూతానికి విద్యార్థులు బలి
X

దిశ, డైనమిక్ బ్యూరో : వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి మృతితో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రీతిని వేధింపులకు గురిచేసి, ఆమె మరణానికి కారణమైన సీనియర్ మెడికో సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ కార్యకర్తలు సోమవారం ఆందోళనలు చేపట్టారు. హిమాయత్‌నగర్ వైజంక్షన్ వద్ద ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ర్యాగింగ్ అరికట్టాలని డిమాండ్ చేస్తూ ర్యాగింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో ర్యాగింగ్ వేధింపులు భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. తెలంగాణలో ర్యాగింగ్ నియంత్రణ చట్టాలు తేవాలని, ర్యాగింగ్‌కి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంకోవైపు, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు కూడా ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడు సైఫ్‌ను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ సైఫ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు రక్షణ లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ర్యాగింగ్ భూతానికి ఎందరో విద్యార్థులు బలి అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, నిజాం కళాశాల కమిటీ ఆధ్వర్యంలో పీడీఎస్‌యూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. సీనియర్ మెడికో సైఫ్ వేధింపుల కారణంగా ప్రీతి మరణించడంపై పిడిఎస్‌యూ ప్రెసిడెంట్ తిరుపతి మాట్లాడారు.

ఈ సమస్య మెడికల్ విద్యార్థిని ప్రీతికి మాత్రమే రాలేదని, యావత్ తెలంగాణ రాష్ట్రంలోని అనేకమంది విద్యార్థులకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విద్యార్థులందరూ స్పందించి పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం 1200 మంది ప్రాణ బలిదానాలు ఇస్తే నేడు నీలో నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. అంటే విద్యారంగాన్ని ఎలా బ్రష్టు పట్టిస్తున్నారు అర్థమవుతుందని వాపోయారు. ప్రీతి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో వరుసగా మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఆత్మహత్యలపై సీఎం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed