Krishank : ‘మూసీ’ పై ఆరోపణలు! బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు లీగల్ నోటీసులు పంపిన సంస్థ

by Ramesh N |
Krishank : ‘మూసీ’ పై ఆరోపణలు! బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు లీగల్ నోటీసులు పంపిన సంస్థ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ పార్టీ స్కామ్‌ చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. తాజాగా మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపణలు చేశారు. దీంతో తమపై నిరాధార ఆరోపణలు చేశారంటూ మన్నె క్రిశాంక్‌కు మెయిన్‌హర్డ్‌ సంస్థ లీగల్‌ నోటీసులు పంపింది. దురుద్దేశంతో తమ కంపెనీ ప్రతిష్ట దెబ్బతినేలా ఆరోపణలు చేశారని ఆ సంస్థ పేర్కొంది. క్రిశాంక్‌ తన వ్యాఖ్యలను 24 గంటల్లోపు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, ఎక్స్‌లో పెట్టిన పోస్టులను తొలగించాలని సంస్థ డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో సివిల్‌, క్రిమినల్‌ పరంగా న్యాయపరమైన చర్యలు చేపడుతామని ‘మెయిన్‌హర్డ్‌’ సంస్థ హెచ్చరించింది.

కాగా, మెయిన్‌హార్ట్‌ సంస్థ ఇచ్చిన నోటీసుల‌పై బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్ స్పందించారు. లీగల్ నోటీసులు విష‌య‌మై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చ‌ర్చించిన‌ట్లు పేర్కొన్నారు. సింగ‌పూర్ కంపెనీ ఇచ్చిన నోటీసుల‌కు బీఆర్ఎస్ లీగ‌ల్ సెల్ స‌మాధానం ఇస్తుంద‌ని తెలిపారు. రూ. 3 వేల కోట్ల కుంభ‌కోణంలో మెయిన్‌హార్ట్‌కు పాకిస్తాన్ రెడ్ వారెంట్ నోటీసులు జారీ చేసింది నిజం కాదా? మెయిన్‌హార్ట్‌ సంస్థను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిషేధించింది నిజం కాదా? అని క్రిశాంక్ ప్ర‌శ్నించారు. అయితే, రూ.3వేల కోట్ల కుంభకోణంలో రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ అయిన కంపెనీకి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మూసీ కాంట్రాక్టు ఇచ్చిందని క్రిశాంక్ ఎక్స్‌లో బుధవారం పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed