స్టేట్ సమస్యలపై కమ్యూనిస్టుల సైలెంట్! ఎఫెక్ట్ తప్పదా..?

by Sathputhe Rajesh |
స్టేట్ సమస్యలపై కమ్యూనిస్టుల సైలెంట్! ఎఫెక్ట్ తప్పదా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కమ్యూనిస్టు పార్టీలంటేనే పోరాటాలకు మారుపేరు. ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుంటారని నానుడి ఉంది. కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం వారు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వామపక్షాలు, బీఆర్ఎస్ కలిసిపోతాయనే భావనతో రాష్ట్రంలోని స్థానిక సమస్యలపై పోరాటాలకు దూరంగా ఉంటున్నాయని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పేపర్ లీక్ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నిరసనలు చేపట్టకపోవడం, నిరుద్యోగుల పక్షాన నిలువుకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ధరణి, విద్యుత్ ఉద్యోగుల ఆందోళన, ఉద్యోగుల 317 జీవో, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇలా ప్రజాసమస్యలపై స్పందన కరువైంది. నాటి పోరాటపటిమ ఏమైందని పార్టీ కేడర్ చర్చించుకుంటున్నారు.

వామపక్షాల పోరాట పటిమ తగ్గిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రజలకు సమస్య వచ్చిందంటే వారికి అండగా ఉండి నిరసనలు చేపట్టేవారు. సాగు, తాగునీటితో పాటు మౌలిక సమస్యలు, నిరుద్యోగ, ఉద్యోగ, కార్మిక, కర్షక సమస్యలపై పోరాటాలు చేసేవారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి సమస్యల పరిష్కారంలో ముందుండేవారు. ప్రజాపోరాటాలతో నిత్యం ప్రజల మధ్యలో ఉండేవారు. నిత్యం ప్రజలను చైతన్యం చేసేవారు. కానీ ఆ పార్టీలో కొంత స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం పేపర్ లీక్ ఘటన రాష్ర్టాన్ని ఓ కుదుపు కుదుపుతుంది.

దీనిపై కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, తెలంగాణ జన సమితితో పాటు విద్యార్థి సంఘాలు సైతం పోరుబాట పట్టాయి. ప్రభుత్వ తీరును నిలదీస్తున్నాయి. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నాయి. కానీ వామపక్ష పార్టీలు మాత్రం అందుకు దూరంగా ఉన్నాయి. నిరసనలు చేపట్టలేదు. వారి గళం వినిపించలేదు. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యారని ప్రజలే ఆరోపిస్తున్నారు. ఇది ఒకటే కాదు ధరణి, విద్యుత్ ఉద్యోగుల ఆందోళన, ఉద్యోగుల 317 జీవో, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇలా పలు సమస్యలపై స్పందన కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేవలం కేంద్రంపైనే గళం

మునుగోడులో వామపక్షాలు బీఆర్ఎస్‌కు మద్దతు పలికాయి. కలిసి పోతామని ప్రకటించాయి. దీంతో రాష్ట్ర సమస్యలపై గళమెత్తడం మానేశాయి. ప్రజాసమస్యలను గాలికి వదిలేశాయి. కేవలం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై గళం వినిపిస్తున్నాయి. సీపీఎం ఏకంగా జనచైతన్యయాత్రలు నిర్వహిస్తుంది. అందులో కేంద్రం కార్పొరేట్ విధానాలను అవలంభిస్తుందని, మనోన్మాదాన్ని ప్రోత్సహిస్తుందని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ అంటూ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో నెలకొన్న మౌలిక సమస్యలపై మాత్రం స్పందించడం లేదు.

అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రకటించిన హామీలపైనా మాట్లాడక పోవడంతో రెడ్ సైనికులు పార్టీ అధినాయకత్వంపైనే గుర్రుగా ఉన్నారు. సీపీఐ సైతం అదే ధోరణి అవలంభిస్తుంది. నామ్ కే వాస్తేగా ఏదో ప్రెస్ మీట్‌లో మాత్రమే స్పందించి చేతులు దులుపుకుంటున్నారని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. ఇలాగే వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల వరకు వామపక్ష పార్టీలకు ఉన్న కేడర్ సైతం దూరమయ్యే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed