హరీష్ రావుపై వ్యాఖ్యలు.. మైనంపల్లిపై చర్యలుంటాయా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-23 03:39:35.0  )
హరీష్ రావుపై వ్యాఖ్యలు.. మైనంపల్లిపై చర్యలుంటాయా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి హరీశ్‌రావును వ్యక్తిగతంగా దూషించడంతో పాటు ముఖ్యమంత్రి కుటుంబంపైనా ఘాటు వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విషయంలో పార్టీ నాయకత్వం ఆచితూచి అడుగేయాలనుకుంటున్నది. ఆయన చేసిన కామెంట్లు చాలా తీవ్రమైనవంటూ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతున్నా నిర్ణయం తీసుకునే విషయంలో తొందరపడొద్దని భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విషయంలో తీసుకున్నటువంటి హడావిడి నిర్ణయాలు ఇప్పుడు అవసరం లేదనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో లేక బహిష్కరించడమో చేస్తే ఆశించిన ఫలితాలు రాకపోగా, పార్టీకే నష్టం చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

మైనంపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత రియలైజ్ కావడం తరచూ జరిగేదేనని, గతంలో జర్నలిస్టుల విషయంలో, నియోజకవర్గంలోని పార్టీ కేడర్ విషయంలో అనేకసార్లు జరిగిందని, ఇప్పుడు కూడా ఆయన పునరాలోచించుకోడానికి తగిన సమయం ఇద్దామనే భావనతో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలిసింది. కొన్ని రోజులు ఈ విషయంలో లీడర్‌షిప్ అంటీ ముట్టనట్లుగా ఉంటే ఆయనే తన తప్పును గుర్తించి పశ్చాత్తాప పడతారని, ఎన్నికల సమయంలో తీవ్ర నిర్ణయం తీసుకోవడం ద్వారా పార్టీకే నష్టమవుతుందని, కొత్త తలనొప్పి అవసరం లేదనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వేడి మీద ఉన్న వాతావరణంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగా మారుతుందని, పరిస్థితులు ఆటోమేటిక్‌గా సర్దుకుంటాయని భావిస్తున్నట్లు తెలిసింది.

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి విషయంలోనూ పార్టీ నాయకత్వం చూసీ చూడనట్లుగానే వ్యవహరించింది. కుమారుడికి టికెట్ విషయంలో వచ్చిన వివాదం కావడంతో వెంటవెంటనే నిర్ణయం తీసుకోకుండా వదిలేయడం ద్వారా టికెట్ల జాబితాను ప్రకటించే టైమ్‌లో పెద్దగా చిక్కులు రాలేదని బీఆర్ఎస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పుడు మైనంపల్లి విషయంలోనూ లైట్‌గా తీసుకుంటే ఆ వ్యాఖ్యల నుంచి ఆయనే తన తప్పును గుర్తిస్తారనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తనంతట తానుగా తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఆలోచించవచ్చుగానీ పార్టీ తరఫున అలాంటి తొందరపాటు నిర్ణయం అవసరం లేదనే స్పష్టతతో నాయకత్వం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికిప్పుడు వెంటనే ఆయనపై చర్యలు ఉండకపోవచ్చనేదే పార్టీ నేతలు చెప్తున్న మాట.

Advertisement

Next Story

Most Viewed