- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గినియార్ పల్లి లో బోసిపోతున్న రేపటి భవిష్యత్తు

దిశ, ఝరాసంగం: ఎదిగే పిల్లలను చూసి తల్లిదండ్రులు ఎవరైనా ఆనందపడుతూ మురిసిపోతారు. కానీ, ఆ గ్రామంలో కొంతమంది పిల్లల వయస్సు పెరిగే కొద్దీ వివిధ రకాల అనారోగ్య సమస్యలను చూసి తల్లిదండ్రులు దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నారు. పిల్లలు ఎదగక పోవడానికి కారణాలేంటి..? ఇలా ఎందుకు జరుగుతోంది? ‘‘మా బాధలు ఎవరితో పంచుకోవాలి. మా ప్రశ్నలకు సమాధానాలు ఎవరిస్తారు. మా పిల్లలకు సోకిన జబ్బులు ఎవరు నయం చేస్తారు’’ అని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం గినియార్ పల్లి గ్రామానికి చెందిన కొంతమంది ప్రశ్నలు ఇవి. చిన్న గ్రామం అయినప్పటికీ దాదాపు 20 మందికి పైగా పిల్లలు, యువకులు వివిధ రకాల జబ్బులతో ఎదగడం లేదు.
ఒకరికి మాటలు రావు, మరొకరికి కాళ్లు చేతులు పని చేయవు, వేరొకరికి చెవులు వినపడవు. మరి కొంతమంది మరుగుజ్జులుగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ గ్రామంలో చాలా మంది పిల్లలు, యువకులు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. గ్రామంలో ఉన్న బోరు బావుల నీళ్ల ప్రభావమా.? నీటిలో ఏమైనా ఫ్లోరైడ్ ఉందా? అనే ప్రశ్నలు గ్రామస్తులకు తలెత్తుతున్నాయి. సమీపంలోని రసాయన కంపెనీల ద్వారా గ్రామానికి భూగర్భ జలాల ద్వారా నీళ్లు కలుషితమవుతున్నాయా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామంలోని అనేకమంది పిల్లలకు, యువకులకు వయసు పెరిగిన బుద్ధి మాంద్యం, అంగవైకల్యం, చెవిటి, మూగ తదితర సమస్యలతో బాధపడుతున్నారు.
గ్రామంలో కూలి పనులు చేసుకునే వారి కుటుంబాల్లోనే కాకుండా అన్ని వర్గాల ఇళ్లల్లో అనేక పిల్లలు ఉండడం వారిని మరింత దుఃఖానికి గురిచేస్తోంది. ఇటీవల కాలంలో గ్రామంలో ముగ్గురు పిల్లలు అనారోగ్య సమస్యలతో మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. జిల్లాలో ఎక్కడలేని విధంగా తమ గ్రామానికి ఈ సమస్య ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా భవిష్యత్తులో తమ పిల్లలకు ఇలాంటి సమస్యలు రాకుండా సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి సమస్యకు పరిష్కార మార్గం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
మా గ్రామాన్ని సందర్శించండి
ఇంత చిన్న గ్రామంలో ఎందుకు ఈ సమస్య తలెత్తింది. జిల్లా అధికారులు, డాక్టర్లు ఒక్కసారైనా మా గ్రామాన్ని సందర్శించండి. మా బాబు పేరు రోహన్ (4) కళ్ళు కనిపించవు, నడవలేడు, మాటలు రావు.మా బాబుకు ఇప్పటి వరకు పెన్షన్ లేదు. భూమి లేదు, ఇల్లు లేదు. కూలిపని చేసుకుని బతుకుతున్నాము. కూలి పని చేసి పిల్లలను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికే ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కడం లేదు. ప్రభుత్వం స్పందించి మా పిల్లల భవిష్యత్తుకు మార్గాన్ని చూపాలి.:- సారా మహేశ్వరి, అంగవైకల్యుడి తల్లి
మా బాబుకు ఒళ్లంతా తెల్ల మచ్చలే..
మా బాబు పేరు శివకుమార్ (22) ఒళ్లంతా తెల్ల మచ్చలే, చెయ్యి సరిగా పనిచేయదు. ఆరోగ్యం కోసం తిరగని ఆసుపత్రి లేదు. మా అబ్బాయే కాకుండా మా ఊర్లో చాలా మందికి ఈ విధంగా అనారోగ్య పరిస్థితి ఉంది. సంబంధిత అధికారులు మా ఊరి యువకులకు, పిల్లలకు ఎందుకు ఇలా జరుగుతుంది. ఒకసారి ఆలోచించి ప్రభుత్వం స్పందించి మా గ్రామంలో యువకులను పిల్లలను ఆదుకోవాలి.:- ఈశ్వరయ్య శివకుమార్ తండ్రి
మా పాపకు మతిస్థిమితం లేదు
మా పాప పేరు నాగలక్ష్మి (16) మాటలు రావు, నడవలేదు, వయస్సు పెరిగినా ఎదగడం లేదు. పాప ఆరోగ్యం కోసం పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. గ్రామానికి వచ్చిన అధికారులకు విన్నవించినప్పటికీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా కుటుంబాన్ని మా పాపను ఆదుకోవాలి. భవిష్యత్తులో పిల్లలకు ఈ విధమైన వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి.:- గొల్ల శ్రీశైలం, మరుగుజ్జు పాప తండ్రి
సమస్య దృష్టికి రాలేదు
గ్రామంలో ఉన్న సమస్య ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. గ్రామంలో ఉన్న సమస్యను సర్వే నిర్వహించి జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.:- డాక్టర్ రమ్య, మండల వైద్యాధికారి