Rain Alert: రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!

by Jakkula Mamatha |
Rain Alert: రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతుంటే, మరోచోట వానలు పడుతున్నాయి. ఇటీవల ఏపీలో కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చేతికి అందివచ్చిన పంట నేల పాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణం(Weather)లో వస్తున్న భిన్నమైన మార్పుల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదే‌శ్‌‌(Andhra Pradesh)లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ(Department of Meteorology) తెలిపింది. ఈ క్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇవాళ(సోమవారం) పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో రేపు(మంగళవారం) అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నిన్న(ఆదివారం) అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో 41.4, విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాయలసీమలో వర్షాలు కురిశాయి. అయితే రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.



Next Story

Most Viewed