రండి.. నాతో చేతులు కలపండి : జూనియర్ ఎన్టీఆర్ పిలుపు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-09-25 14:53:09.0  )
రండి.. నాతో చేతులు కలపండి : జూనియర్ ఎన్టీఆర్ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : 'జీవితం చాలా విలువైనది, రండి నాతో చేతులు కలపండి..మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది' అని యంగ్ టైగర్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ ఎక్స్​ వేదికగా విడుదల చేసిన వీడియోలో పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్​కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా ఎక్స్​ వేదికగా ఎన్టీఆర్‌ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి యువత సహకరించాలంటూ వీడియోలో ఎన్టీఆర్​ పిలుపునిచ్చారు. ఎంతో మంది యువత డ్రగ్స్​కు ఆడిక్ట్​ అయి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో లేదంటే సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్‌ కోసమో డ్రగ్స్​కు ఆకర్షితులు కావడం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని సూచించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ఈ నెల 27న విడుదల కాబోతుండగా, అదనపు షోలు, టికెట్ల రేట్ల పెంపునకు ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు జారీ చేయడం గమనార్హం.

ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి డ్రగ్స్​, సైబర్​ క్రైమ్​పై సినీ పరిశ్రమ యువతకు అవగాహన కల్పిస్తూ రెండు నిమిషాల అవగాహన వీడియో చిత్రీకరించాలని సూచించారు. టికెట్​ రేట్ల పెంపునకు అనుమతి అంటూ వచ్చే వారికి ఓ షరతుగా రేవంత్ ఈ ప్రతిపాదన చేశారు. సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై కూడా ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి పిలుపుకు స్పందించి పలువురు సినీ తారలు డ్రగ్స్​సే నో టూ డ్రగ్స్ అంటూ వీడియోలు విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్​ దేవరకొండ, సీనియర్​ నటుడు మోహన్​ బాబు సైతం డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్​కు సహకరిస్తూ వీడియో విడుదల చేశారు. డ్రగ్స్​ వల్ల యువత తమ జీవితాలను నాశం చేసుకోవద్దని సూచించారు. యువత బాధ్యతగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed