పేదల జీవన స్థితిగతులను మార్చాలన్నదే సీఎం లక్ష్యం

by Sridhar Babu |
పేదల జీవన స్థితిగతులను మార్చాలన్నదే సీఎం లక్ష్యం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : మూసీ ప్రక్షాళన ద్వారా లక్షలాది మంది పేదల జీవన స్థితిగతులను మార్చాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్రను పురస్కరించుకొని గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా సంగం వద్ద ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో ఉన్న మూసీ నది రానురాను మురుగుకూపంగా మారిపోయిందని, గడిచిన 42 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలలో పనిచేసిన అనుభవం తనకుందని, మూసీ ప్రక్షాళనకు అన్ని ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిది సాహసోపేతమైన చర్య అని అన్నారు.

సాగునీటితో పాటు, తాగునీరు అందించడమే కాకుండా, మూసీ పరీవాహక ప్రాంతంలోని లక్షలాది పేద ప్రజల జీవన పరిస్థితులను మార్చేందుకు తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టనున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కష్టమైనప్పటికీ ఖచ్చితంగా మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని అన్నారు. మూసీ పరీవాహక రైతులు, ప్రజలు, కులవృత్తుల వారి బాధలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారికి మేలు చేసేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి తన జన్మదినం రోజు మూసీ పాదయాత్ర చేపట్టనున్నారని, ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు మూసీనది లక్షలాది మందికి సాగు, తాగునీరు ఇచ్చిందని, అలాంటిది ఈరోజు మూసీ వెంట నడవలేని పరిస్థితి ఉందని, దుర్గంధంతో ఉన్న మూసీ నది సుందరీకరణ తర్వాత సాగునీటిని, తాగునీటిని అందించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.

మేనిఫెస్టోలో ఈ విషయాలు తాము పొందుపరచనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పుట్టినరోజున పాదయాత్ర చేసి మూసీని పరిశీలించనున్నారని చెప్పారు. నదిని శుద్ధి చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు, రంగారెడ్డి, హైదరాబాద్​ జిల్లాల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరు మీద 50 వేల కోట్ల రూపాయలు, కాలేశ్వరం పేరు మీద లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, కానీ మూసీ నది మాత్రం గుర్తుకు రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్డీఏ నాగిరెడ్డి, డీపీఓ సునంద, రోడ్లు భవనాల శాఖ నల్గొండ జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story