Zika virus case: గుజరాత్‌లో జికా వైరస్ కేసు.. చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన వ్యక్తి

by S Gopi |
Zika virus case: గుజరాత్‌లో జికా వైరస్ కేసు.. చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన వ్యక్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లో ఓ వ్యక్తి జికా వైరస్ బారిన పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు వ్యక్తి కోలుకుని ఇంటికి చేరుకున్న తర్వాత అతనికి జికా వైరస్ సోకినట్టు తెలిసింది. గురువారం గుజరాత్ ఆరోగ్య శాఖ దీని గురించి ప్రకటన విడుదల చేసింది. గాంధీనగర్‌కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి జ్వరం ఇతర కారణాలతో వారం క్రితం ఆసుపత్రిలో చేరాడు. అతను పూర్తిగా కోలుకున్నాడని నిర్ధారించిన తర్వాత ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేశాయి. అయితే, ఆశ్చర్యకరంగా అతను వెళ్లిన మూడురోజులకు ఆ వ్యక్తికి జికా వైరస్ సోకిందని మెడికల్ రిపోర్టుల్లో తేలింది. అయితే, సదరు వ్యక్తికి ఈ వైరస్ ఎలా సోకిందనే దానిపై స్పష్టత రాలేదు. అతను ఇటీవలి కాలంలో విదేశాలకు కూడా వెళ్లలేదు. గత నెల జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఆ వ్యక్తి గాంధీనగర్ ఆసుపత్రిలో చేరినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు అతని నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి పంపారు. ఇది జికా ఇన్ఫెక్షన్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చికిత్స అనంతరం వారం క్రితమే అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ ఎన్ఐవీ నుంచి అతనికి జికా వైరస్ సోకినట్టు రిపోర్టులు అందాయి. అప్రమత్తమైన అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆ వ్యక్తి నివశించే ప్రాంతాన్ని పర్యవేక్షణలో ఉంచారు.

Advertisement

Next Story

Most Viewed