సచివాలయం ఓపెనింగ్‌లో సీఎం.. ‘మన్ కీ బాత్‌‌’లో గవర్నర్

by Sathputhe Rajesh |
సచివాలయం ఓపెనింగ్‌లో సీఎం.. ‘మన్ కీ బాత్‌‌’లో గవర్నర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త సచివాలయం ప్రారంభోత్సవం ఈవెంట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, చీఫ్ సెక్రటరీ మొదలు అధికారులు, సిబ్బంది బిజీ అయిపోయారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా సెక్రటేరియట్‌లోనే ఉండిపోయింది. కానీ గవర్నర్‌ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ 100వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆహ్వానితులతో రాజ్‌భవన్‌లోని ప్రోగ్రామ్‌కు పరిమితమయ్యారు. రాజ్‌భవన్‌కు మూడు ఇన్విటేషన్లు వెళ్ళాయని, వారు వస్తారనే ఉద్దేశంతో మూడు వాహనాలకు పార్కింగ్ సౌకర్యాన్ని రిజర్వు చేసిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. కానీ గవర్నర్‌కు మాత్రం సచివాలయ ఓపెనింగ్ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్విటేషన్ రాలేదని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.

అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో తరచూ ‘మై గవర్నమెంట్’ అని చెప్పే గవర్నర్‌కి ఇన్విటేషన్ వెళ్ళకపోవడం గమనార్హం. “ప్రభుత్వమే ఆమెది అయినప్పుడు ప్రత్యేకంగా పిలిచేదేముంటుంది? ఆమెను ఆహ్వానించాల్సిన అవసరమూ ఏముంటుంది?” అంటూ అధికారుల నుంచే కామెంట్లు వినిపించడం గమనార్హం. కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే గవర్నర్ హాజరు తప్పనిసరి అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయించడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడం.. ఈ రెండు అంశాల్లో మాత్రమే గవర్నర్ పాత్ర కంపల్సరీ అనే వివరణ ఇచ్చారు. మిగిలిన సందర్భాల్లో ఆమెకు ఆహ్వానం పంపడం ఒక తప్పనిసరి ప్రోటోకాల్ కాదన్నారు.

Advertisement

Next Story

Most Viewed