- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi: ఏపీ నుంచి ఇప్పించండి.. నిర్మలా సీతారామన్‌కు సీఎం రేవంత్ కీలక రిక్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో పార్లమెంట్‌లోని ఆమె ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావల్సిన గ్రాంటుపై చర్చించారు. పునర్విభజన చట్టంలో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుదలకు అంగీకరించారని ఆయన గుర్తుచేశారు. 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన గ్రాంటును ఇప్పటి వరకు విడుదల చేయలేదని, నాలుగేళ్లకు కలిపి పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర పునర్విభజన తర్వాత హైదరాబాద్‌లోని హైకోర్టు, రాజ్ భవన్, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జ్యుడీషియల్ అకాడమీ సహా ఇతర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆయా సంస్థల విభజన పూర్తయ్యే వరకు నిర్వహణకు అయిన రూ.703.43 కోట్లను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని.. అందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.408.49 కోట్లను తెలంగాణకు చెల్లించాల్సి ఉందని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ మొత్తం చెల్లింపునకు ఆంధ్రప్రదేశ్ సమ్మతి తెలిపిందని, కేంద్ర హోం శాఖ సైతం ఆ మొత్తం తెలంగాణకు చెల్లించాలని ఏపీకి లేఖలు రాసిందని సీఎం వివరించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఆ మొత్తాన్ని తెలంగాణకు చెల్లించలేదని...ఆ రూ.408.49 కోట్లను వడ్డీతో సహా తెలంగాణకు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రుణాల పంపిణీ విషయంలో తెలంగాణ నుంచి ఏకపక్షంగా రూ.2,547.07 కోట్ల రికవరీకి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిరసన తెలిపినా పట్టించుకోలేదని, ఈ విషయంపై మరోసారి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులన్నింటిని 2014-15లో కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
పునర్విభజన చట్టంలోని జనాభా ప్రాతిపదికన ఆ మొత్తంలో ఏపీ నుంచి తెలంగాణకు రూ.495.20 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. అకౌంటెంట్ జనరల్, ఆంధ్రప్రదేశ్‌కు తాము పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆ మొత్తాన్ని తెలంగాణకు సర్దుబాటు చేయడం లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకొని తెలంగాణకు రావల్సిన నిధులు ఇప్పించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయిన కార్యక్రమంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, బలరాం నాయక్, ఎం. అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ కడియం కావ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు పాల్గొన్నారు.