BREAKING: స్థానిక సంస్థల ఎన్నికలపై CM రేవంత్ కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2024-07-09 13:44:14.0  )
BREAKING: స్థానిక సంస్థల ఎన్నికలపై CM రేవంత్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మహబూబ్ నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం నాయకులు పని చేయాలని.. కార్యకర్తల్ని సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గెలిపించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు నామినేటేడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ గెలుపుకు కృషి చేసిన కార్యకర్తల్నే కుర్చీలో కూర్చొబెట్టాలనే నేతలకు చెప్తున్నానని.. నాకు వచ్చిన సీఎం పదవి కార్యకర్తల కష్టం, త్యాగాల ఫలితమేనని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తల్ని తప్పకుండా అదుకుంటామన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలను హింసించారని, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడుల సమయంలో కేసీఆర్ రాజనీతి ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఉసురు తగిలిందని తనదైన శైలీలో రేవంత్ విమర్శలతో విరుచుకుపడ్డారు. కాగా, రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవి కాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.

Advertisement

Next Story