నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 11 వేల టీచర్ పోస్టుల భర్తీపై CM రేవంత్ కీలక ప్రకటన

by Satheesh |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 11 వేల టీచర్ పోస్టుల భర్తీపై CM రేవంత్ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా నడిచిందని, సర్కారు పాఠశాలలను మూసివేసిందని, ఇకపైన సింగిల్ టీచర్ స్కూళ్ళను మూసేయడానికి వీల్లేదని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.పిల్లలు లేరనే పేరుతో స్కూళ్ళను మూసివేసే విధానం సరైంది కాదని, విద్యార్థులు ఆసక్తి చూపడంలేదని సమర్ధించుకోవడం కారణమూ కాదన్నారు. మారుమూల గ్రామాలు, తండాలు, గూడేలలో ప్రభుత్వ పాఠశాలలను తెరుస్తామని స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో టీచర్లు లేరనే కారణంగా విద్యార్థులు రావడం లేదని అంటున్నారని, మరికొన్ని చోట్ల పిల్లలు లేరనే పేరుతో స్కూళ్ళను మూసేయాల్సి వస్తుందని చెప్తున్నారని.. ఇవి వింటుంటే కోడి ముందా?.. లేక గుడ్డు ముందా?.. అనే వాదన గుర్తుకొస్తున్నదన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సోమవారం జరిగిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు.

గ్రామాల్లో కొత్త పాఠశాలలను తెరిపించాలంటే ఉపాధ్యాయుల అవసరం ఉన్నదని, అందువల్లనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇచ్చిందని, త్వరలోనే 11 వేల మంది ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ జరగబోతున్నదని సీఎం రేవంత్ నొక్కిచెప్పారు. మారుమూల గ్రామాల్లో స్కూళ్ళను నెలకొల్పడం ద్వారా ఆదివాసీలు, గిరిజనులు, దళితులకు చదువుకునే అవకాశం లభిస్తుందన్నారు. విద్యాశాఖకు ప్రభుత్వం చేసే ఖర్చు భవిష్యత్తు తరాలకు పెట్టుబడి లాంటిదన్నారు. ఇప్పుడు సర్వీసులో ఉన్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల్లో 90% మంది ప్రభుత్వ బడుల్లోనే చదివారని, చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్రమంత్రులు సైతం ప్రభుత్వ బడుల్లో చదివినవారేనని గుర్తుచేశారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం సాలీనా సగటున రూ. 80 వేల చొప్పున ఖర్చుపెడుతున్నదని, ఈ ఖర్చులో అధికశాతం టీచర్ల వేతనాలకే వెళ్తున్నదన్నారు. అయినా విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నందున ప్రభుత్వం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు.

ప్రభుత్వ స్కూళ్ళకు విద్యార్థులు రావడంలేదనే వాదనను దృష్టిలో పెట్టుకుని ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరుతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. పిల్లలను చేర్పించకపోతే పాఠశాల మూతబడుతుందనే అంశాన్ని తల్లిదండ్రులకు అర్థం చేయిస్తున్నామన్నారు. “ప్రభుత్వ పాఠశాలలో చదివిన నాకు చదువు విలువ బాగా తెలుసు. అందుకే ప్రభుత్వ స్కూళ్ళను మరింతగా ప్రోత్సహించాలని, చదువును అందరికీ అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగమే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటు. స్కూళ్ళ నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించాం. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వారికే ఇచ్చి నిధులను గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా విడుదల చేసేలా నిర్ణయం తీసుకున్నాం. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడానికి రూ. 2 వేల కోట్లను ఖర్చు చేస్తున్నాం” అని సీఎం రేవంత్ వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి మార్కులు పొందిన విద్యార్థుల్ని ప్రతిభా పురస్కారాల పేరుతో సత్కరించడం అభినందించాల్సిన విషయమని, నిజంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించాల్సి ఉన్నదని అన్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో చదివి టాపర్లుగా ఎదిగిన పిల్లలను ప్రభుత్వమే సన్మానిస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. మట్టిలో మాణిక్యాలుగా రాణించిన విద్యార్థులు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని, ఇకపైన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణంగా ఉందన్నారు. కార్పొరేట్ పాఠశాలలతో ప్రభుత్వ విద్యార్థులు పోటీపడటం ఆ గౌరవాన్ని మరింతగా పెంచిందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిస్తే తల్లిదండ్రులు కూడా పంపడానికి ఆసక్తి చూపుతారని అన్నారు.

ప్రతి విద్యార్థికీ అమ్మఒడే తొలి పాఠశాల అని గుర్తుచేసిన సీఎం రేవంత్... ఇటీవల రెసిడెన్షియల్‌ స్కూళ్లలో పిల్లల్ని చేర్పించడంతో వారు అమ్మ ఒడికి దూరమవుతున్నారన్న ఆవేదనను వ్యక్తం చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివించడం ద్వారా తల్లిదండ్రులు, పిల్లల సంబంధాలు బలహీనపడుతున్నాయంటూ ఇటీవల ఒక స్టడీ రిపోర్ట్ వచ్చిందని గుర్తుచేశారు. ఇది ఒక సామాజిక సమస్యగా మారే ప్రమాదముందన్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనే సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేస్తే కాస్త మార్పు వస్తుందని, ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని అన్నారు. గ్రామీణ పాఠశాలలపై నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సూచించారు.

గతంలో ఒకే సిలబస్‌ను ఏళ్ల తరబడి అమల్లో ఉండేదని, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చడంపై దృష్టి పెట్టలేదని సీఎం గుర్తుచేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఇకపై విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిలబస్‌ను మారుస్తామని, విలువైన సూచనలు ఎవరు చేసినా తప్పకుండా స్వీకరిస్తామన్నారు. ఇటీవల వెలువడిన టెన్త్ ఫలితాల్లో 10/10 జీపీఎస్‌ సాధించిన విద్యార్థులు ఇంటర్‌లోనూ దాన్ని అందుకోవాలని, ప్రతి ఒక్కరూ డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నా అని సీఎం రేవంత్‌ అన్నారు. ప్రజలు, వారి అవసరాలే కేంద్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రజా ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నందున చదువు ఎప్పటికీ తల్లిదండ్రులకు భారంగా మారదని, ప్రభుత్వానికి విద్యారంగంపై స్పష్టమైన అవగాహన, చిత్తశుద్ధి ఉన్నదని నొక్కిచెప్పారు.

Advertisement

Next Story

Most Viewed