- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
SC వర్గీకరణపై అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో CM రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటన చేశారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని అన్నారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రులకు రాని గొప్ప అవకాశం నాకు వచ్చింది. ఎస్సీ వర్గీకరణ(SC Classification)ను అమలు చేయడం నాకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ దళితులకు ఉన్నత పదవులు, అవకాశాలను కాంగ్రెస్ కల్పించిందని తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ నిరంతరం శ్రమిస్తుందని చెప్పారు. అంతకుముందు ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశ పెట్టారు.
ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటన చేసింది. ఎస్సీల వర్గీకరణ అమలు చేసే బాధ్యతను తమ ప్రభుత్వం, మంత్రులం తీసుకుంటామని ఎస్సీ సామాజికవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగా న్యాయ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చర్యలు చేపట్టిందని తెలిపారు.
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయటం, ఈ తీర్పుతో ముడిపడి ఉన్న వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్లే మార్గాలను సూచించటంతో పాటు అవసరమైన సిఫారసులు చేయాలని కోరుతూ 2024 సెప్టెంబర్ 12వ తేదీన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీని నియమించాం. కమిటీ పలు దఫాలుగా సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్సీల ఉప కులాల వర్గీకరణ అమలు తీరును అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారుల బృందాన్ని పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు పంపించింది. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహాను స్వీకరించింది. విస్తృత సమావేశాలు, సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం ఏకసభ్య న్యాయ కమిషన్ వేయాలని కమిటీ సిఫారసు చేసింది.
కమిషన్ విధి విధానాలు
= తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ కులాలు, ఉప కులాల హేతుబద్ధమైన వర్గీకరణకు అందుబాటులో ఉన్న జనాభా గణన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలి.
= ఎస్సీల్లోని వివిధ ఉప సమూహాల మధ్య ఉన్న అంతరాలను గుర్తించేందుకు సమగ్ర అధ్యయనాలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో తగినంత ప్రాతినిధ్యం లేకపోవడంపై దృష్టి పెట్టాలి.
= ఎస్సీల్లోని ఉప సమూహాల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా వెనుకబాటుతనానికి సంబంధించిన వివిధ కోణాలను పరిశీలించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ కులాల ఉప వర్గీకరణను సమర్థవంతంగా అమలుచేసే విధానాన్ని గుర్తించాలి.
= రిజర్వేషన్ ప్రయోజనాలను షెడ్యూల్డ్ కులాల్లోని వివిధ ఉప సమూహాలకు పంపిణీ చేసేందుకు చేపట్టాల్సిన ఇతర చర్యలను సూచించాలి.
వీటితో పాటు ఎస్సీల (59 కులాలు) జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది.
వీటన్నింటితో పాటు వివిధ సంస్థలు, సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను, అన్ని విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ క్షుణ్నంగా పరిశీలించి తమ నివేదికను తయారు చేసింది. కేవలం 82 రోజుల వ్యవధిలో ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.