- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏప్రిల్ మొదటి వారంలో.. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

దిశ, సిద్దిపేట ప్రతినిధి : యాసంగి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో యాసంగి సీజన్ లో 419 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం కొలిచే యంత్రాలు, కాంటాలు, టార్ఫాలిన్ కవర్లు, గన్నీ బ్యాగులు, ఇతరత్రా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. వరికోతలు ప్రారంభమైన నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. రైతులు పండించి ధాన్యం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నే విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. దళారులను నమ్మి మోస పోవద్దని రైతులకు సూచించారు. ఎండిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. గ్రామాల్లో దొడ్డు రకం సన్నరకం వరి సాగు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు..? ఎప్పుడు హార్వెస్టింగ్ చేస్తారనే విషయాలను వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత చూడాలన్నారు. అదే విధంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఎప్పటికప్పుడు గోదాములకు తరలించేందుకు సరిపడా లారీలను అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసిన వెంటనే అధికారులు ట్యాబ్ లో ఎంట్రీ చేస్తే రెండు నుంచి మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రైస్ మిల్లర్లు ధాన్యం దిగుమతి సహకరించాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు అందరూ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్. డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, జిల్లా సివిల్ సప్లై అధికారి తనుజా, డీఎం సివిల్ సప్లై ప్రవీణ్, ఆర్డీవోలు సదానందం, రామ్మూర్తి, చంద్రకళ, ఏసీపీలు మధు, పురుషోత్తం, సతీష్, ఎల్ డీ ఎం హరిబాబు, డీ ఎం మార్కెటింగ్ నాగరాజు, డీ ఏ ఓ రాధిక, అధికారులు, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.