TG CMO : మనందరినీ ఏకం చేసే ఒక కల.. న్యూయార్క్ నుంచి సీఎం రేవంత్ సందేశం

by Ramesh N |
TG CMO :  మనందరినీ ఏకం చేసే ఒక కల.. న్యూయార్క్ నుంచి సీఎం రేవంత్ సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభమైంది. ఇవాళ న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం లభించింది. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలోనూ వారు పర్యటిస్తారు. "కీలకమైన న్యూయార్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను. ప్రవాస భారతీయులైన ఇక్కడి మన తెలుగు సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమ, ఆప్యాయతలతో మాకు స్వాగతం పలకడానికి విచ్చేశారు. మనందరినీ ఏకం చేసే ఒక కల.. తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడం" అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

న్యూయార్క్‌ నగరం నుంచి మొదలైన ఈ పెట్టుబడుల సాధన పర్యటనలో రాబోయే 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చలు జరగనున్నాయి. కాగా, ముఖ్యమంత్రి నాయకత్వంలోని బృందంలో పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు భాగమవుతారు. సీఎం పర్యటనలో భాగంగా ఇవాళ (సమయం 3:00 గంటలకు) న్యూజెర్సీలో ప్రవాస తెలంగాణ ప్రజలతో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది.

Advertisement

Next Story

Most Viewed