CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. కేటీఆర్, ఈటల రాజేందర్‌కు సవాల్

by Gantepaka Srikanth |
CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. కేటీఆర్, ఈటల రాజేందర్‌కు సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(Hydraa)పై అసెంబ్లీలోనే చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. గురువారం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల(Family Digital Cards) ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడే ఎందుకు సూచనలు ఇవ్వలేదని విపక్షాలను ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయబోదని.. మూసీ పరివాహక ప్రాంతాల పేదలకు 15 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. పేదలకు డబుల్ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముంటుందని అడిగారు. కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao), సబిత కుమారుడి ఫామ్‌హౌజ్‌లు కూల్చాలా? వద్దా? అని ప్రజలను అడిగారు. వారి ఫామ్‌హౌజ్‌లు కూల్చుతారనే భయంతోనే పేదలను అడ్డుపెట్టుకొని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.

మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం రాజకీయం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మీ భరతం పడతామని హెచ్చరించారు. కిరాయి మనుషులతో కేటీఆర్, హరీష్ రావులు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. చిన్న పాటి వర్షానికే మునిగిపోతున్న నగరాన్ని ఇంకెప్పుడు కాపాడుకోవాలని ప్రశ్నించారు. త్వరలోనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తాం.. అందరూ వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. ఒక్కరోజే కాదని.. కేటీఆర్, హరీష్ రావులు సచివాలయానికి వస్తే నాలుగు రోజులు సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని హితవు పలికారు.

అంతేకాదు.. కేంద్రం నిధుల కోసం ఈటల రాజేందర్ నేతృత్వంలో మోడీ వద్దకు వెళ్దామని సూచించారు. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌‌తో పాటు తమ మంత్రివర్గం మొత్తం మీతో కలిసి ఢిల్లీకి వస్తుందని.. రాష్ట్రానికి రూ.25 వేల కోట్లు ఇప్పించాలని సవాల్ చేశారు. అంతేకాదు.. హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు ఎవరు ఆక్రమించారో కూడా చర్చించి తేల్చుదామని అన్నారు. ఈ మూసీ వల్ల నల్లగొండ జిల్లా ప్రజలు విషం మింగుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల దుఃఖం తమకు తెలుసని.. పేదవాడి కన్నీళ్లు చూడాలని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదని అన్నారు. ప్రతీ పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.

Next Story

Most Viewed