నా ముందున్న లక్ష్యం అదే.. మనసులో మాట బయటపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

by Gantepaka Srikanth |
నా ముందున్న లక్ష్యం అదే.. మనసులో మాట బయటపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల నుంచి తాను నాయకత్వం అంటే ఏంటో తెలుసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి(Gachibowli)లో ఐఎస్‌బీ లీడర్ షిప్ సమ్మిట్(ISB Leadership Summit) ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన వారసత్వం ఉంది. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి నాయకులే దీనికి ఉదాహరణ అని తెలిపారు. ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం చాలా ముఖ్యం. తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేయడంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా అవసరం.

గొప్ప పనులు చేయడానికి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేం. గొప్ప నాయకులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మన పోరాటంలో మనం చాలా కోల్పోవచ్చు. దేశంలోని గొప్ప నాయకులు, మన కాంగ్రెస్ నాయకులు, ప్రజల కోసం తమ వృత్తిని, డబ్బును, సుఖాలను, స్వేచ్ఛతో పాటు వారి జీవితాన్ని కూడా త్యాగం చేశారు. మీరు మంచి నాయకుడిగా ఎదగాలంటే, ముందుగా ధైర్యం, త్యాగం అనే రెండు విలువల గురించి తెలుసుకోవాలి. ధైర్యంతో పాటు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఐఎస్‌బీ విద్యార్థులకు సూచించారు.

ప్రజలతో నిత్యం నేరుగా సంబంధాలు పెట్టుకోవాలి. పేదలు, ధనికులు, చిన్నా, పెద్దా అన్న భేదం లేకుండా సమాన గౌరవం ఇస్తూ స్నేహ భావంతో అందరినీ కలుపుకుపోవాలి. ISB విద్యార్థులుగా మీరు హైదరాబాద్, తెలంగాణతో పాటు న్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌లు. తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలి. తెలంగాణను ప్రపంచంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడానికి నాకు మీ సాయం కావాలి. మీరు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలతో తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడండి. భారతదేశంలోని ఇతర నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని నేను కోరుకోవడం లేదు.

న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో, సియోల్‌ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలోనే భారతదేశం, హైదరాబాద్ అత్యుత్తమంగా మారాలన్నది పెద్ద లక్ష్యం. అది అసాధ్యం కాదు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. నేను సౌత్ కొరియాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించాను.. సౌత్ కొరియా లాంటి చిన్న దేశం ఒలింపిక్స్‌లో అనేక పథకాలు సాధించింది.. మన దేశం ఒలింపిక్స్‌లో ఒక్క బంగారు పథకం కూడా సాధించలేకపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు.

Advertisement

Next Story