Chief Minister of Telangana : అభయహస్తం ఫైల్‌పై CM రేవంత్ రెడ్డి తొలి సంతకం

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-07 09:26:28.0  )
Chief Minister of Telangana : అభయహస్తం ఫైల్‌పై CM రేవంత్ రెడ్డి తొలి సంతకం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ‘అభయహస్తం’ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. దివ్యాంగురాలు రజనికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో)పై రెండో సంతకాన్ని చేసి ఆమెకు అపాయింట్‌మెంట్ లెటర్ జారీచేశారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన వేదిక మీదనే రెండు ఫైళ్ళపై సంతకాలు చేసిన రేవంత్‌రెడ్డి.. గవర్నర్ వెళ్ళిపోయిన తర్వాత కృతజ్ఞత సభలో ప్రసంగించారు. మేం పాలకులం కాదు.. సేవకులం.. అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన సీఎం రేవంత్.. ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే అక్కడ ప్రగతి భవన్ గోడలు బద్దలయ్యాయన్నారు.

తెలంగాణ ప్రజల పోరాటాలు, త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పడిందని, ప్రజా పాలన మొదలైందన్నారు. దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని నొక్కిచెప్పారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పాటయిందన్నారు.

అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనిందని, అందుకే ఈ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని, ఒక ముఖ్యమంత్రిగా తాను ఈ మాట ఇస్తున్నానని పేర్కొన్నారు. ఇంతకాలం ప్రగతి భవన్‌గా ఉన్న భవనం ఇప్పుడు జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌గా మారుతున్నదని, రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ జరుగుతుందన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకావాన్ని ఈ ప్రాంత అభివృద్ధికే వినియోగిస్తామని, కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తుపెట్టుకుని గుండెల్లో పెట్టుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed