- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం.. భారీగా తగ్గిన ఉద్యోగుల జీతాలు!
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, నిర్వహణ లోపభూయిష్టంగా మారిందని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి.. దానిని చక్కదిద్దడంపై ఫోకస్ పెట్టారు. ప్రజాధనం విచ్చలవిడిగా దుర్వినియోగమైందంటూ అధికారులు ఇచ్చిన వివరాలతో అంచనాకు వచ్చారు. పలు సంక్షేమ కార్యక్రమాల్లోని లీకేజీలను, అవినీతిని, అవకతవకలను ‘కాగ్’ సైతం బయటపెట్టడంతో నివారణా చర్యలపై దృష్టి సారించారు. దుబారాను తగ్గించడంతో పాటు పొదుపు మంత్రాన్ని పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా సొంత ఆఫీసు నుంచే సంస్కరణల పర్వానికి శ్రీకారం చుట్టారు. గత పాలనలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పరిమిత ఆదాయ వనరులతో పాలనను గాడిలో పెట్టాలని డిసైడ్ అయ్యారు.
సొంత కార్యాలయం నుంచే శ్రీకారం
సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత కార్యాలయం నుంచి ఆర్థిక సంస్కరణలను మొదలుపెట్టారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునే కో-టెర్మినస్ పోస్టులకు గత ప్రభుత్వం విచ్చలవిడిగా పేమెంట్ చేసింది. దాంట్లో సీఎం రేవంత్ తాజాగా మార్పులు చేశారు. సీపీఆర్వో, పీఆర్వోలు సహా పలువురి వేతనాల్లో భారీగా కోత పెట్టారు. వారు వినియోగించే వాహనాలపైనా ఆంక్షలు విధించారు. మంత్రుల పేషీల్లో పర్సనల్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్.. లాంటి కేటగిరీల మినిస్టీరియల్ స్టాఫ్ వేతనాలను భారీగానే తగ్గించారు. వాహనాల వినియోగంలో గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న విచ్చలవిడితనానికి బ్రేక్ వేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. కారు అలవెన్సుల రూపంలో జరిగే దుబారానూ నియంత్రించేలా పలు విభాగాల సెక్రటరీలు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
సొంత కాన్వాయ్ మొదలు..
గత ప్రభుత్వం కాన్వాయ్ కోసం ఖరీదైన కార్లను కొని విజయవాడలో బుల్లెట్ ప్రూఫింగ్, ఇంటీరియర్ చేయిస్తున్నదంటూ మీడియా ద్వారానే ఓపెన్ కామెంట్లు చేసిన సీఎం రేవంత్.. ప్రజాధనాన్ని గత సర్కారు విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఆరోపించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల వరకూ కాన్వాయ్‌లో తన సొంత కారునే రేవంత్ వాడుకున్నారు. దావోస్ పర్యటనకు వెళ్లిన సమయంలో కాన్వాయ్‌లోని వైట్ కలర్ కార్లకు బ్లాక్ కలర్ వేయించి వాటినే వాడుతున్నారు. గత ప్రభుత్వంలో కాన్వాయ్‌లో ఉండే వాహనాల సంఖ్యనూ తగ్గించుకున్నారు. ఆఫీసులో, సొంత చాంబర్‌లో ఇంటీరియర్ పేరుతో రూ.కోట్లు ఖర్చు చేయకుండా పాత ప్రభుత్వంలో ఉన్న సౌకర్యాలతోనే సరిపెట్టుకోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇతర శాఖల్లోని వాహనాలపై ఆంక్షలు..
కొందరు అధికారులు రెండు లేదా అంతకంటే ఎక్కువ డిపార్టుమెంట్లలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి వారికి ఏదేని ఒక శాఖకు చెందిన వాహనాన్ని మాత్రమే వాడుకునేలా ఆంక్షలు విధించారు. దీంతో ఇతర శాఖల్లో వారు వాడుకోవాల్సిన వాహనాలను అవసరమైన చోటుకు తరలించారు. కారు అలవెన్సు, అద్దె కార్లకు చెల్లించే రెంట్ తదితరాలపైనా లోతుగా సమీక్షించి వీలైనంతగా దుబారాను నివారించాల్సిందిగా ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఇచ్చే జీతాల కన్నా గత ప్రభుత్వంలో ఎక్కువ స్థాయిలో చెల్లించిందని, నామినేటెడ్ పోస్టులు, మంత్రుల వ్యక్తిగత సిబ్బంది, కో-టెర్మినస్ పోస్టులకూ వెచ్చించిందని అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు. ఇలాంటి ఎక్కువ వేతనాలకు కోత పెట్టాలని ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ లీకేజీలకు చెక్
సంక్షేమ పథకాల పంపిణీలో గత సర్కారులో బీఆర్ఎస్ నేతలు, అప్పటి ప్రజా ప్రతినిధులు కమీషన్ల రూపంలో లబ్ధిదారుల నుంచి నొక్కేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, లీకేజీలను అరికట్టేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుంచి పన్ను రూపంలో సమకూరుతున్న నిధులను తిరిగి సంక్షేమ పథకాల కోసం ప్రజలకే అందిస్తున్నందున ఒక్క పైసా వృథా కావడానికి వీల్లేదంటూ పలు సమీక్షా సమావేశాల్లో అధికారులకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో టెండర్లను పిలవకుండా నామినేటెడ్ పద్ధతిలో పంచాయతీల్లో పనులను అప్పగించడం ద్వారా బోగస్ బిల్లులతో రూ.కోట్లకు గండి పడిందని గుర్తించిన ప్రభుత్వం.. వాటి పేమెంట్లను సైతం నిలిపేసింది. ఇదే తరహాలో ప్రభుత్వ యంత్రాంగంలో సైతం దుబారాను తగ్గించి తప్పనిసరి అవసరాలకు మాత్రమే ఖర్చు చేసే విధానాన్ని తీసుకొచ్చింది.